కోస్తా : జగన్ స్పీడును తట్టుకోలేకపోతున్నారా ?
రాబోయే ఎన్నికల్లో 175కి 175 నియోజకవర్గాల్లోను వైసీపీనే గెలవాలని జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న టార్గెట్ నేతలను టెన్షన్లో పడేస్తోంది. ఏదో మాటవరసకు అనుకున్నట్లుగా కాకుండా జగన్ అందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు. 175 సీట్లనూ స్వీప్ చేయటానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను పార్టీ పరంగానే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా అమలుచేస్తున్నారు. ఇటు పార్టీ అటు ప్రభుత్వ కార్యక్రమాలను పక్కగా అమలు చేసేందుకు, పర్యవేక్షించేందుకు వీలుగా రీజనల్ కోఆర్డినేటర్లు, కో ఆర్డినేటర్లను నియమించారు.
జగన్ ప్లానింగ్ బాగానే ఉంది కానీ దాని ద్వారా పెరిగిపోతున్న ఒత్తిళ్ళను నేతలు తట్టుకోలేకపోతున్నారు. గడపగడపకు వైసీపీ, జగన్నన్నే మన భవిష్యత్తు లాంటి కార్యక్రమాలే ఉదాహరణ. ఈమధ్యనే రీజనల్ కో ఆర్డినేటర్ గా బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామాచేసిన విషయం తెలిసిందే. బాలినేని రాజీనామాతో పార్టీ బాధ్యులపై పెరిగిపోతున్న ఒత్తిళ్ళపై పార్టీలో చర్చ పెరిగిపోతోంది. రీజనల్ కో ఆర్డినేటర్లు, కో ఆర్డినేటర్లుగా నియమితులైన వాళ్ళు తమ నియోజకవర్గాలతో పాటు కేటాయించిన జిల్లాల్లో పార్టీ+ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలి. సరిగా జరగకపోతే వాటిని పక్కాగా అమలయ్యేట్లుగా చూడాలి.
పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల అమలుకోసం బయట జిల్లాల్లో తిరుగుతుంటే తమ నియోజకవర్గాల్లో మైనస్ అయిపోతున్నారు. ఎంతసేపు బయటజిల్లాల్లోనే తిరుగుతున్న కారణంగా ఇక తమ నియోజకవర్గాల్లో నేతలు, క్యాడర్, జనాలను కలవలేకపోతున్నారు. ఈ కారణంగానే గతంలోనే అనంతపురం కోఆర్డినేటర్ గా కాపు రామచంద్రారెడ్డి, గుంటూరు కో ఆర్డినేటర్ గా మేకతోటి సుచరిత రాజీనామాలు చేశారు. ఇపుడు బాలినేని అయినా గతంలో కాపు, మేకతోటి అయినా రాజీనామాలకు చెప్పిన కారణాలు అనారోగ్యమనే.
వీళ్ళే కాదు మిగిలిన రీజనల్ కో ఆర్డినేటర్లు, కో ఆర్డినేటర్లది కూడా ఇదే పరిస్ధితట. కారణం ఏమిటంటే జగన్ స్పీడును, ఆలోచనలను నేతలు అందుకోలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు మాత్రమే వీటికి మినహాయింపు. వీళ్ళు తమ నియోజకవర్గాలను వదిలేసి ఎక్కడ తిరిగినా గెలుస్తమనే నమ్మకం ఉండబట్టే వీళ్ళు బయట జిల్లాల్లో తిరుగ్గలుగుతున్నారు. అందరికీ అంతటి సౌలభ్యముండదని జగన్ మరచిపోయారు. ఎన్నికలు వచ్చేస్తున్న నేపధ్యంలో ఇంకెంతమంది రాజీనామాలు చేస్తారో చూడాల్సిందే.