ఉత్తరాంధ్ర : పొత్తులపై నాగబాబుకు తల బొప్పికట్టిందా ?
రాబోయే ఎన్నికల్లో పొత్తులా లేకపోతే ఒంటరిపోటీయా అన్నది జనసేనకు పెద్ద తలనొప్పిగా తయారైపోయింది. మిత్రపక్షం బీజేపీని వదిలించుకోలేకపోతోంది. అలాగని టీడీపీతో పొత్తుపెట్టుకునే ధైర్యం చేయలేకపోతోంది. ఇదే సమయంలో పార్టీని క్షేత్రస్ధాయిలో బలోపేతం చేస్తున్నారా అంటే అదీలేదు. ఎందుకంటే పార్టీకి గ్రామకమిటి నుండి జిల్లా కమిటి వరకు అసలు కార్యవర్గాలే లేవు. అందుకనే నియోజకవర్గాల్లో పోటీచేయబోయే అభ్యర్ధులే దొరకటంలేదు.
పార్టీ తరపున పోటీచేయటానికి అభిమానులు చాలామందే పోటీపడచ్చు. అయితే మిగిలిన పార్టీల అభ్యర్ధులకు పోటీ ఇచ్చేంతస్ధాయిలో గట్టి అభ్యర్ధులు ఉన్నారా అంటే లేరనే చెప్పాలి. ఈ నేపధ్యంలోనే రాబోయే ఎన్నికల్లో పోటీచేసే విషయంలో అధినేత పవన్ కల్యాణ్ పెద్ద అయోమయంలో ఉండిపోయారు. ఈ అయోమయం నుండి ఎలా బయటపడాలో కూడా అర్ధంకావటంలేదు. సరిగ్గా ఈ సమయంలోనే యలమంచిలి పార్టీ ఆఫీసు ప్రారంభం సందర్భంగా నేతలు, క్యాడర్ కు క్లాసు పీకినట్లున్నారు.
పొత్తుల గురించి ఎవరు మాట్లాడద్దని వార్నింగ్ ఇచ్చారు. పొత్తుల విషయం పవన్ కు వదిలేసి క్షేత్రస్ధాయిలో పనిచేసుకోవాలని జనసైనికులు, వీరమహిళలకు చెప్పేశారు. పొత్తుల గురించి పదేపదే పార్టీలో చర్చించవద్దని కూడా చెప్పారు. కొందరు పొత్తుల విషయాన్ని, పార్టీ నిర్వహణపైనా పవన్ కే సలహాలు ఇవ్వటం ఏమిటంటు మండిపోయారు. ఎన్నికలు, పొత్తుల విషయాన్ని పూర్తిగా పవన్ కు వదిలేసి పార్టీ నిర్మాణం, బలోపేతం చేసే విషయాలను మాత్రమే నేతలు చూసుకోవాలని గట్టిగా చెప్పారు.
అంటే నాగబాబు మాటలు విన్నతర్వాత ఎక్కడికి వెళ్ళినా నేతలు, క్యాడర్ పొత్తుల గురించే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారన్న విషయం అర్ధమవుతోంది. పొత్తులపై క్లారిటి ఇవ్వకుండా నేతలను పనిచేసుకోమని చెబితే ఎలాచేస్తారు ? ఇదే విధమైన కన్ఫ్యూజన్ టీడీపీలో కూడా ఉందన్న విషయం పవన్ లేదా నాగబాబుకు తెలీదా ? నియోజకవర్గంలో జనసేన పోటీచేస్తుందో లేదో తెలీకుండా నేతలు, క్యాడర్ ఎలా పనిచేస్తారు ? లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకుని జనసేనను బలోపేతంచేసేది వేరే పార్టీ అభ్యర్ధి పోటీచేస్తే పనిచేయటానికా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మరీ క్లారిటి ఇవ్వకపోతే ఎలా నాగబాబూ ?