అమరావతి : ప్రభుత్వాన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?
అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళ స్ధలాలు ఇవ్వకుండా చేయగలిగిన అన్నీ ప్రయత్నాలు చేశారు. ఏదీ వర్కవుటవ్వకపోతే చివరకు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ దిగినట్లున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అద్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఎందుకయ్యా అంటే రాజధాని ప్రాంతంలో ఆర్-5 జోన్ అని కొత్తగా ఏర్పాటుచేసి పేదలకు భూములు ఇవ్వకూడదట. అలాగే గత ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో నిర్మించిన 5024 టిడ్కో ఇళ్ళని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పంపిణీచేయలేదట.
ఇళ్ళపట్టాల పంపిణీని నిలిపేయాలని, టిడ్కో ఇళ్ళను లబ్దిదారులకు కేటాయించాలనే డిమాండ్లతో కొలికపూడి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే కొలికపూడి 24 గంటలూ 365 రోజులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద బురదచల్లుతునే ఉంటారు. ఈయన చంద్రబాబునాయుడు మద్దతుదారుడిగా ఎల్లోమీడియా ఛానళ్ళల్లో డేబట్లలో పాల్గొంటుంటారు. ఈయనకు జగన్ అంటే ఎంతమంటుందో డిబేట్లు చూసే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు.
పేదలకు ఇళ్ళపట్టాల పంపిణీని అడ్డుకునేందుకు అమరావతి జేఏసీ ముసుగులో కోర్టుల్లో కేసులు వేశారు. ఉపయోగంలేకపోయింది. పుంఖానుపుంఖాలుగా వ్యతిరేక వార్తలు, కథనాలతో అమరావతి ప్రాంతజనాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఏమీ వర్కవుట్ కాలేదు. కోర్టుల్లో కేసులు ఓడిపోయారు. పేదలకు ఇళ్ళపట్టాల పంపిణీకి కోర్టులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. రాజకీయంగా ఇళ్ళపట్టాలు ఇవ్వటాన్ని బహిరంగంగా అడ్డుకోలేరు. పట్టాల పంపిణీ జరిగిపోతే టీడీపీకి నష్టం తప్పదనే భయం మొదలైంది.
అన్నీ ప్రయత్నాలు ఫెయిలైన తర్వాత చివరకు ఆమరణ నిరాహార దీక్ష పేరుతో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి దిగినట్లున్నారు. కొలికపూడి దీక్ష చేస్తే ఇళ్ళపట్టాల పంపిణీ ఆగిపోతుందా ? గతంలో 1134 ఎకరాలను పంపిణీ చేయాలని అనుకున్న ప్రభుత్వం తాజాగా అది సరిపోదన్న కారణంగా మరో 300 ఎకరాలు అదనంగా కేటాయించింది. ఇక టిడ్కో ఇళ్ళ కేటాయింపుల విషయంలో జగన్ చేసింది తప్పే. అయితే ఇళ్ళకోసం కొలికపూడి నాలుగేళ్ళు ఎందుకు చూస్తు కూర్చున్నారు ? ఇళ్ళపంపిణీని ప్రారంభించాలని ప్రభుత్వం డిసైడ్ అయిన నేపధ్యంలో హఠాత్తుగా నిరాహార దీక్షకు దిగటం ఏమిటి ?