అమరావతి : పవన్ రోల్ మోడల్ కు పెద్ద షాక్
ఎప్పుడు మాట్లాడినా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఒకటే మాట చెబుతుంటారు. అదేమిటంటే కర్నాటకలో జేడీఎస్ చీఫ్ కుమారస్వామి ముఖ్యమంత్రి అయినట్లే తాను కూడా కింగ్ మేకర్ లేదా కింగ్ అవుతానని అంటుంటారు. అయితే తాజాగా వెల్లడైన కర్నాటక ఎన్నికల ఫలితాలను చూస్తే ఓటర్లు కుమారస్వామికి పెద్ద షాకే ఇచ్చారు. 224 సీట్ల అసెంబ్లీలో జేడీఎస్ కు దక్కింది 20 సీట్లు మాత్రమే.
పోలింగుకు ముందు తర్వాత కూడా కుమారస్వామి మాట్లాడుతు జేడీఎస్ కింగ్ మేకర్ కాదని కింగే అవుతుందని పదేపదే చెప్పారు. కుమారస్వామి నమ్మకం ఏమిటో తెలీదు కానీ తన పార్టీని చాలా ఓవర్ గా ఆలోచించినట్లు అర్ధమైంది. రాష్ట్రం మొత్తం జేడీఎస్ పోటీపై పెద్దగా దృష్టిపెట్టలేదు. పోటీచేసిన సీట్లలో కూడా చాలావరకు ఓడిపోయారు. పవన్ చెప్పినట్లే కుమారస్వామి కూడా పార్టీకి పట్టున్న ప్రాంతాలైన ఓల్డ్ మైసూరు, కోస్టల్ కర్నాటక, సెంట్రల్ కర్నాటక ప్రాంతాల్లో మాత్రమే పోటీచేశారు.
అయితే పోటీచేసిన చాలా చోట్ల ఓడిపోయారు. తాజా ఫలితాల ద్వారా అర్ధమైన విషయం ఏమిటంటే కుమారస్వామి ప్రతి ఎన్నికలోను కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకున్నారని. 2018లో తలుపుతట్టిన అదృష్టం మళ్ళీ మళ్ళీ తనను వరిస్తుందని కుమారస్వామి బాగా నమ్మకంగా ఉన్నారు. అందుకనే తమ పార్టీ కింగ్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు.
తీరాచూస్తే ఏమైంది ఎక్కడ కూడా సరైన పోటీ ఇవ్వలేక చతికిలపడింది. ఏ నియోజకవర్గాల్లో అయితే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులు ఒకళ్ళకు మరొకళ్ళు తీవ్రమైన పోటీ ఇచ్చుకున్నారో అలాంటి కొన్నిచోట్ల మాత్రమే జేడీఎస్ గెలవగలిగింది. మిగిలిన నియోజకవర్గాల్లో అడ్రస్ లేకుండా పోయింది. సో పవన్ పదేపదే చెప్పుకునే రోల్ మోడల్ కుమారస్వామి పరిస్ధితి ఇలాగైపోయింది. తాజా ఫలితాలను చూస్తే గెలిచిన ఎంఎల్ఏలు కూడా జేడీఎస్ లో ఎక్కువ రోజులు ఉండేట్లుగా లేరు. మరి చివరకు ఏమవుతుందో ఏమో కుమారస్వామి కూడా చెప్పలేకపోతున్నారు.