కొత్త పార్లమెంట్: తెలుగుదేశం రాంగ్స్టెప్?
ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ మొదటి నుంచి బీజేపీకి అనుకూలంగానే ఉంటోంది. వైసీపీ ఎంపీలు అందరూ ఆ ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రోగ్రాంకు అటెండ్ అయితే చంద్రబాబు ఏటు వైపు ఉంటారనేది సందిగ్ధంగా మారింది.
టీడీపీ గతంలో బీజేపీ తో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లి ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు బీజేపీతో కలవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఏదైనా జాతీయ పార్టీ మద్దతు లేకపోతేే కొత్త రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకోలేం అనే వాదనతో ఇలా వెళుతున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవంలో దాదాపు ఎన్డీఏ తరఫున 14 పార్టీలు హాజరవుతున్నాయి.
మరి టీడీపీ హాజరైతే కాంగ్రెస్ తో బంధం తెంపుకున్నట్లేనా.. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తుందా? రాష్ట్రంలో అనుసరించే విధానం ఏమిటి? కార్యకర్తలకు ఇవ్వబోయే సూచనలు ఏమిటి? ముందు చూస్తే నుయ్యి.. వెనక చూస్తే గొయ్యి అన్న చందంలా మారింది టీడీపీ పరిస్థితి. బీజేపీతో వెళితే అయిదేళ్లకే మళ్లీ మాట మార్చాడని అపవాదు. కాంగ్రెస్ తో వెళితే గత ఎన్నికల్లో దెబ్బతిన్న విధానం ఎప్పటికీ గుర్తిండి పోయేలా తయారైంది. అందుకే టీడీపీ జాతీయ స్థాయిలో ఎవరితో కలవాలో ఎటు తేల్చుకోలేక సతమతమవుతున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.