అమరావతి : చంద్రబాబు, బీజేపీ కలిస్తే హ్యాపీ ఎవరో తెలుసా ?

Vijaya


రాబోయే ఎన్నికల్లో పొత్తుల విషయంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారాల్లో ఒకటేమిటంటే తెలంగాణాలో బీజేపీకి తెలుగుదేశంపార్టీ మద్దతివ్వటమట. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో శనివారం రాత్రి చంద్రబాబు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. తెలంగాణాలో ఎలగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ అందుకు టీడీపీ మద్దతు కోరిందనేది ఒక ప్రచారం. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఓట్లను అన్నీ నియోజకవర్గాల్లో బీజేపీకి వేయించాలని అమిత్ షా కోరినట్లు ప్రచారం జరుగుతోంది.



ఇందులో నిజమెంతో అబద్ధమెంతో తెలీదు కానీ ఒకవేళ నిజమే అయితే కేసీయార్ నెత్తిన పాలుపోసినట్లే. ఎందుకంటే తెలంగాణాకు చంద్రబాబు ఒక విలన్ లాగైపోయారు. చంద్రబాబు ఎప్పుడు తెలంగాణాలో ప్రచారంచేసినా దాన్ని కేసీయార్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. చంద్రబాబును బూచిగా చూపించి సెంటిమెంటును రెచ్చగొట్టి లబ్దిపొందుతున్న విషయం తెలిసిందే. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుని చంద్రబాబు తెలంగాణాలో ప్రచారంచేశారు.



దాంతో చంద్రబాబును కేసీయార్ బూచిగా చూపించి సెంటిమెంటును రెచ్చగొట్టారు. చివరకు జనాలంతా కేసీయార్ మాట ప్రకారం అప్పటి టీఆర్ఎస్ కే పట్టంగట్టారు. చంద్రబాబుతో పొత్తుపెట్టుకుని నష్టపోయామని తర్వాత కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెంపలేసుకున్నారు. అంతకుముందు ఎన్నికల్లో కూడా చంద్రబాబునే విలన్ గా చూపించి టీడీపీని తెలంగాణాలో నేలమట్టం చేసేశారు. ఇలాంటి టీడీపీతో ఇపుడు బీజేపీ చేతులు కలపటమంటే ఇంకేమన్నా ఉందా ?



చంద్రబాబు, బీజేపీ కలిస్తే కేసీయార్ ఊరుకుంటారా ? మళ్ళీ సెంటిమెంటును రెచ్చగొట్టి లబ్దిపొందేందుకు ప్రయత్నించరా ? అసలు ప్రతిపక్షాలు బలంగా ఉన్నపుడు అధికారపార్టీకి లబ్ది జరుగుతుందని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికలనాటికి కాంగ్రెస్, బీజేపీలు ఎంతగా  బలంపుంజుకుంటే కేసీయార్ కు అంతమంచింది.  అలాంటిది  తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబు యాక్టివ్ గా తిరుగారంటే ఏమవుతుందో  ఇక చెప్పాల్సిన పనేలేదు. బీజేపీ, చంద్రబాబు చేతులు కలిపటంతో హ్యాపీ అయ్యేది ముందు కేసీయార్ అన్నట్లుగా ఉంది వ్యవహారం. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: