ఉత్తరాంధ్ర : ఉక్కు ఆస్తులు అమ్మేస్తున్నారా ?
విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి ఉన్న స్ధిరాస్తులను కేంద్రప్రభుత్వం అమ్మేస్తోంది. కొంతమొత్తం నిధులను సాయంచేసి, సొంతంగా గనులను కేటాయిస్తే ఫ్యాక్టరీ బ్రహ్మాండంగా పుంజుకుంటుంది. అయితే ఆ పనిచేయకుండా నష్టాల్లో ఉన్నదని సాకును చూపించి ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని నరేంద్రమోడీ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ప్రైవేటీకరణను ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికసంఘాలు, రాజకీయపార్టీలు, స్ధానికంగా ఉన్న ప్రజాసంఘాలు, ప్రజాలు ఎంతగా వ్యతిరేకిస్తున్నా కేంద్రం ఏమాత్రం లెక్కచేయటంలేదు.
తాజాగా ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న భూములను, ఇళ్ళను అమ్మకానికి పెట్టేసింది. 25 ఎకరాల్లోని 588 క్వార్టర్స్ తో పాటు 84 ఇళ్ళని అమ్మకానికి పెట్టినట్లు ఫ్యాక్టరీ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ బాలరాజు ఒక ప్రకటన జారీచేశారు. ఈనెల 9వ తేదీన జారీఅయిన ప్రకటన ప్రకారం ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు పదిరోజుల్లో స్పందించాలని ఉంది. ఆస్తులన్నింటినీ ఏకమొత్తంగా కానీ లేదా విడివిడిగా కానీ కొనుగోలు చేయవచ్చనే బంపారఫర్ కూడా ఇచ్చారు.
అమ్మకానికి పెట్టిన 25 ఎకరాలు నగరంలోని మూడు ప్రాంతాల్లో ఉంది. ఇందులో హెచ్ బీ కాలనీలో ఉన్న 22 ఎకరాల బిట్ ధర సుమారు రు. 1500 కోట్లు విలువచేస్తుంది. ఇక మిగిలిన 3 ఎకరాల స్ధలం అక్కడున్న ధరల ప్రకారం మరో రు. 250 కోట్లు విలువచేస్తుందని అంచనా. మొత్తానికి ఏపీ విషయంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందనేందుకు ఇదే తాజా ఉదాహరణ. ఇదే విధమైన నిర్ణయం తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో తీసుకునుంటే అప్పుడు తెలిసేది కేంద్రానికి జనాల దెబ్బేంటో.
అయితే ఈ మొత్తంలో ఎల్లోమీడియా జగన్మోహన్ రెడ్డినే తప్పుపడుతోంది. జగన్ ప్రభుత్వం చేతకానితనం వల్లే కేంద్రం ఉక్కుఫ్యాక్టరీని అమ్మేస్తోందని బురదచల్లేస్తోంది. ఉక్కుఫ్యాక్టరీ కేంద్రప్రభుత్వం సొంతం. తన ఫ్యాక్టరీని కేంద్రం అమ్మేసుకుంటుంటే రాష్ట్రప్రభుత్వం ఏ విధంగా అడ్డుపడగలదు ? అప్పటికి అమ్మొద్దని జగన్ లేఖలు రాశారు. ఎంపీలు పార్లమెంటులో కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడారు. అయినా కేంద్రం వెనక్కు తగ్గటంలేదు. చివరకు బీజేపీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చేతులెత్తేశారు. నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీలను అమ్మేయాలని కేంద్రం పాలసీ డెసిషన్ తీసుకుంటే మనమేమి చేయగలమని పవన్ స్పష్టంగా చెప్పారు. అలాంటిది ఎల్లోమీడియా మాత్రం జగన్నే తప్పుపడుతోంది.