హైదరాబాద్ : దాడుల టార్గెట్ ఇదేనా ?

Vijaya




ఎన్నికల కాలం కదా ఏ చిన్న పరిణామం జరిగినా వెంటనే రాజకీయకోణంలో చూడటం మామూలే. అలాంటిది ఏకకాలంలో ముగ్గురు  అధికార బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇళ్ళపైన ఐటీ రెయిడ్స్ జరిగితే కలకలం మొదలవ్వకుండా ఎలాగుంటుంది. ఇప్పటికే కల్వకుంట్ల కవిత పాత్రను ఢిల్లీ లిక్కర్ స్కామ్ చార్జిషీట్లో చాలాసార్లు ఈడీ ప్రస్తావించింది.  స్కామ్ లో సౌత్ గ్రూప్ తరపున కవితదే కీలకపాత్రగా ఈడీ పదేపదే ఆరోపిస్తోంది. ఒకవైపు లిక్కర్ స్కామ్ విచారణ జరుగుతుండగానే మరోవైపు ఐటీ దాడులు మొదలయ్యాయి.




మెదక్ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి, భువనగిరి  ఎంఎల్ఏ పైళ్ళ శేఖరరెడ్డి, నాగర్ కర్నూలు ఎంఎల్ఏ మర్రి జనార్ధనరెడ్డి ఇళ్ళు, ఆఫీసులపై ఏకకాలంలో ఐటి అధికారులు దాడులు చేశారు. బుధవారం తెల్లవారి మొదలైన దాడులు, సోదాలు  గురువారం కూడా కంటిన్యు అవుతున్నాయి. విచిత్రం ఏమిటంటే అధికారులతో కూడిన 70 బృందాలు ముగ్గురి ఇళ్ళపైన దాడులు చేసి విస్తృతంగా సోదాలు జరపటమే. తమ సోదాల్లో ఇప్పటివరకు ఏమి బయటపడ్డాయనే విషయాన్ని మాత్రం ఐటి అధికారులు ప్రకటించలేదు.




ఇంతకుముందు కూడా ఐటి, ఈడీ అధికారులు దాడులు చేశారు. అప్పట్లో మంత్రి మల్లారెడ్డి ఇంటిమీద, గంగుల కమలాకర్ ఇంటి మీద కూడా దాడులు జరిగాయి. అయితే అప్పట్లో మంత్రుల ఇళ్ళమీద వేర్వేరుగా దాడి జరిగింది. కానీ ఇపుడు ఒకేసారి ముగ్గురి మీద దాడి జరగటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపులు, వేధింపులు చేయటానికి దాడులు చేయిస్తోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.




ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న నేపధ్యంలో అధికారపార్టీ నేతలను లొంగదీసుకునేందుకే బీజేపీ దర్యాప్తు సంస్ధలను అస్త్రాలుగా ప్రయోగిస్తోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. తెలంగాణాలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్నది బీజేపీ ప్రయత్నాలు. అయితే వచ్చేఅవకాశాలు కనబడటంలేదు. ఎందుకంటే పార్టీ తరపున పోటీచేయటానికి అన్నీ నియోజకవర్గాల్లో బలమైన నేతలు అభ్యర్ధులుగా దొరకటంలేదు. అందుకనే ఇలాంటి దాడులు, కేసులతో నేతలను లొంగదీసుకుని బీజేపీలో చేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుంది. అయితే ఇలాంటి ప్రయత్నాలు రివర్సు కొడతాయని బీజేపీ ఆలోచిస్తున్నట్లు లేదు. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: