గోదావరి : పవన్ను ఉతికి ఆరేసిన ముద్రగడ
అండి అండి అంటూనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఉతకి ఆరేశారు. వారాహియాత్రలో పవన్ అనేక ప్రాంతాల్లో మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా ప్రత్యర్ధులపైన నోటికొచ్చినట్లు విరుచుకుపడుతున్నారు. పనిలోపనిగా ముద్రగడ పైన కూడా పరోక్షంగా ఆరోపణలుచేశారు. ఆ నేపధ్యంలోనే పవన్ను ఉద్దేశించి ముద్రగడ చాలా పెద్ద లేఖరాశారు. ఆ లేఖలో అంశాలవారీగా పవన్ను ఫుల్లుగా వాయించేశారు.
కాపు రిజర్వేషన్లకోసం ఉద్యమాలు చేసి రాజకీయంగా ఎదగాలని అనుకుంటున్నారని పరోక్షంగా ముద్రగడను ఎత్తిపొడిచారు. దానికి లేఖరూపంలో ముద్రగడ సమాధానమిచ్చారు. ఉద్యమాన్ని తన ఎదుగుదలకు వాడుకోలేదని, చిత్తశుద్దితో ఉద్యమాలు చేసినట్లు చెప్పారు. కులాన్ని అడ్డుపెట్టుకుని తాను ఎదగలేదని, యువతను వాడుకునే ఉద్దేశ్యంతో వారిలో భావోద్వేగాలు రెచ్చగొట్టలేదని, ప్రభుత్వాలు మారినపుడల్లా ఉద్యమాలు చేయలేదని గుర్తుచేశారు. తనకంటే ఎంతో బలవంతుడైన పవన్ తాను వదిలేసిన కాపు ఉద్యమాన్ని ఎందుకు టెకప్ చేయలేదో చెప్పాలన్నారు.
కాపు కులాన్ని వాడుకుని ఎవరు లబ్దిపొందాలని అనుకుంటున్నారో అందరికీ తెలుసని చురకలంటించారు. ఎవరి దగ్గర ఎవరు ప్యాకేజీ తీసుకుని జనాలను రెచ్చగొడుతున్నారో కూడా జనాలంతా చూస్తున్నట్లు హెచ్చరించారు. ఎంఎల్ఏ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని తిట్టడానికి అనవసరంగా సమయాన్ని వృధాచేయకుండా వైజాట్ స్టీల్ ఫ్యాక్టరీని కాపుడుకోవటం కోసం, ప్రత్యేక హోదా సాధనకు, ప్రత్యేక రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఉద్యమాలు చేయాలని సూచించారు.
ఎంఎల్ఏ తండ్రి, తాతలపై పవన్ ఆరోపణలు చేయటం మానుకోవాలన్నారు. ఎంఎల్ఏ తండ్రి భాస్కరరెడ్డి, తాత కృష్ణారెడ్డికి కాపులకు ఉన్న అనుబంధాన్ని ముద్రగడ చెప్పారు. గతంలో వాళ్ళు కాపు ఉద్యమాలకు, సభలకు చేసిన సాయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎక్కడ కాపు సభలు జరిగినా, ఉద్యమాలు జరిగినపుడు ద్వారంపూడి కుటుంబంచేసిన సాయాన్ని ఎవరు మరచిపోరని చెప్పారు. అలాంటి కుటుంబంపై నోటికొచ్చినట్లు మాట్లాడితే నష్టమే తప్ప ఉపయోగముండదన్నారు. నిజంగానే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అరాచకక వాది, అవినీతి పరుడైతే పవన్ స్వయంగా కాకినాడలో పోటీచేసి ఓడించాలని సూచించారు. ఒక్కమాటలో చెప్పాలంటే పనికిమాలిన మాటలు పక్కనపెట్టేసి పనికొచ్చే పనిచేయమని సలహా ఇచ్చారు.