అమరావతి : జనసేనకు ఎన్నికల కమీషన్ షాక్
మొన్నటివరకు కామన్ సింబల్ కోసం పోరాడి ఓడిపోయిన జనసేనకు ఇపుడు మరో షాక్ తగిలింది. ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లో గుర్తింపుపొందిన రాజకీయపార్టీలుగా జనరల్ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమీషన్ వైసీపీ, టీడీపీలను మాత్రమే గుర్తించింది. గుర్తింపుపొందిన రాష్ట్రపార్టీల జాబితాలో వాటి గుర్తులతోనే వైసీపీ, టీడీపీలను కంటిన్యుచేస్తున్నట్లు చెప్పింది. అంటే జనసేనను కేంద్ర ఎన్నికల కమీషన్ గుర్తింపుపొందిన రాజకీయపార్టీగా అంగీకరించలేదు. మొన్నటివరకు కామన్ సింబల్ గా గాజుగ్లాసు గుర్తుకోసం పోరాడిన విషయం తెలిసిందే.
కమీషన్ను ఎంతడిగినా ఉపయోగం కనబడలేదు. ఎందుకంటే ఏ పార్టీకయినా గుర్తులు, గుర్తింపు ఆ పార్టీ తెచ్చుకున్న ఓట్లు, సీట్ల ప్రాతిపదికన మాత్రమే దక్కుతాయి. కమీషనన్ నిబంధనల ప్రకారం చూస్తే పై రెండు జనసేనకు వర్తించవు. అందుకనే జనసేన పార్టీ తరపున పోటీచేయబోయే అభ్యర్దులకు కామన్ సింబల్ గా గాజుగ్లాసు గుర్తును కేటాయించలేమని చెప్పేసింది. గాజుగ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ గా ఉంచింది. అయితే తాజా నిర్ణయంలో జనసేనకు కాస్త ఊరట లభించిందనే చెప్పాలి.
స్ధానికసంస్ధల ఎన్నికలకు సంబంధించి మాత్రం గాజుగ్లాసు గుర్తును జనసేనకు కేటాయిస్తున్నట్లు చెప్పింది. జనసేనను రిజర్వుడు సింబల్ కలిగిన రిజస్టర్డ్ పార్టీల జాబితాలోనే ఉంచింది. తాజా నిర్ణయం ప్రకారం ఇపుడు ఏదైనా కారణాలతో స్ధానికసంస్ధలకు ఉపఎన్నికలు జరిగితే జనసేన అభ్యర్ధులు గాజుగ్లాసు గుర్తుమీదే పోటీచేయచ్చు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం జనసేన అభ్యర్ధులకు గాజుగ్లాసు కామన్ సింబల్ గా దొరికే అవకాశాలు లేదని తేలిపోయింది.
నిజంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఇది చాలా ఇబ్బందనే చెప్పాలి. పోటీచేయబోయే అభ్యర్ధుల్లో నామినేషన్ వేసేనాటికి అందుబాటులో ఉండే గుర్తుల్లో ఏదోఒకదానిని తీసుకోవాల్సుంటుంది. జనసేన తరపున పోటీచేసే ఒక్కో అభ్యర్ధి ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో గుర్తుపై పోటీచేస్తారు. ఎలక్షనీరింగ్ గనుక సక్రమంగా చేసుకోకపోతే జనాలతో ఓట్లేయించుకునేందుకు జనసేన అభ్యర్ధులు నానా అవస్తలు పడాల్సుంటుంది. అలాగే ప్రచారం సమయంలో కూడా పవన్ తో పాటు పొత్తులు పెట్టుకునే మిత్రపక్ష పార్టీల నేతలకు ఇబ్బందులు తప్పేట్లులేదు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.