అమరావతి : జనసేన మాత్రమే మిగిలిందా ?

Vijaya


తొందరలోనే వంగవీటి రాధాకృష్ణ పార్టీ మారబోతున్నట్లు సమాచారం. పార్టీ మారబోతున్నారంటే ఇపుడు ఏపార్టీలో ఉన్నారని అడగకూడదు. ఎందుకంటే చెప్పటం కష్టమే. సాంకేతికంగా టీడీపీలో ఉన్నారు. అయితే తిరిగేదంతా వైసీపీ నేతలతోనే. రాధాని కలిస్తున్నది ఎక్కువగా జనసేన నేతలు. కాబట్టి ఇపుడు రాధా ఏ పార్టీలో ఉన్నారు అనేకన్నా తొందరలోనే జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే కాపులంతా జనసేనకు రేపటి ఎన్నికల్లో ఓట్లేయబోతున్నారట. అందుకనే ఎంఎల్ఏగా గెలవటానికి తనకు జనసేనే కరెక్టని రాధా అనుకుంటున్నట్లు ప్రచారం మొదలైంది.





ఇక్కడ విషయం ఏమిటంటే రాధా ఏ పార్టీలో ఉన్నా ఒకటే. ఎందుకంటే జనాల్లో తిరగటానికి ఈయన ఇష్టపడరు. 24 గంటలూ జనాల్లోనే ఉంటున్న నేతలకు ఓట్లుపడటమే కష్టంగా ఉంది. అలాంటిది జనాల్లో కనబడకుండా ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే రాధాకు ఓట్లెవరు వేస్తారు ? పైగా మిగిలిన సామాజికవర్గాల్లో కాదు కనీసం కాపుల్లో కూడా రాధాకు పట్టులేదు. లేకపోతే వంగవీటి మోహనరంగా (రంగా) కొడుకంటే ఎలాగుండాలి. పార్టీని పక్కనపెట్టేస్తే నామినేషన్ వేస్తే రాధా గెలిచిపోవాలి. ఎందుకంటే రంగా అంటే జనాల్లో ఇప్పటికీ అంత క్రేజుంది.





అలాంటిది రాధాకు జనాలు ఓట్లేయటంలేదంటే అర్ధమేంటి ? 2004 ఎన్నికల్లో మాత్రమే గెలిచారు. తర్వాత ఎప్పుడు పోటీచేసినా ఓడిపోవటమే. రంగా కొడుకు అన్న బలమైన వేదికను కూడా రాధా సక్రమంగా ఉపయోగించుకోలేదు అనటానికి ఇదే నిదర్శనం. ఇలాంటి రాధా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి భారమే తప్ప ఎలాంటి ఉపయోగముండదు.




2019 ఎన్నికల్లో వైసీపీని ఓడగొడతానని చెప్పి టీడీపీ తరపున ప్రచారంచేస్తే ఏమైంది ?  రాధా మాటలను ఎవరు పట్టించుకోలేదు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన రాధా తర్వాత ప్రజారాజ్యంపార్టీలో చేరారు. ఆ తర్వాత విలీనం కారణంగా మళ్ళీ కాంగ్రెస్ నేతయ్యారు. మళ్ళీ వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి రాజీనామ చేసి టీడీపీలో చేరారు. చేరిన తర్వాత ఎక్కడా యాక్టివ్ గా లేరు. ఇపుడు మళ్ళీ జనసేనలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇన్నిపార్టీలు మారే నేతను జనాలు ఆదరిస్తారా ?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: