అమరావతి : మోడీ లెక్క ఎప్పుడో తప్పిందా ?

Vijaya


ఏపీ బీజేపీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే విషయంలో అగ్రనేతల లెక్క తప్పినట్లే అనిపిస్తోంది. ఎందుకంటే అధ్యక్షుడిగా సోమువీర్రాజున్నా లేకపోతే దగ్గుబాటి పురందేశ్వరి ఉన్నా తేడా ఏమీ ఉండదు. ఎందుకంటే ప్రజలను ఆకర్షించగలిగినంత స్ధాయి ఉన్న నేతలు పార్టీలో లేరు. కీలకస్ధానాల్లో ఉన్న నేతల్లో చాలామందికి జనబలమే లేదు. ప్రజాబలం లేని నేతలను అధ్యక్షులుగా ఎవరిని నియమిస్తే మాత్రం ఏమిటి ఉపయోగం ? అసలు సమస్యంతా నరేంద్రమోడీ మైండ్ సెట్లో ఉంటే.





తన మైండ్ సెట్ మార్చుకోకుండా రాష్ట్ర అధ్యక్షులను మార్చినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం ఉండదని అర్ధంచేసుకోవటంలేదు. సమైక్యరాష్ట్రంలోనే బీజేపీ బాగా దెబ్బతినేసింది. అలాంటి పార్టీకి జవసత్వాలు అందించే అవకాశం 2014 ఎన్నికల విజయంతో మోడీకి వచ్చింది. అయితే ఆ అవకాశాన్ని నరేంద్రమోడీ చేతులారా చెడగొట్టుకున్నారు. విభజనహామీలను తుంగలో తొక్కేయటం ద్వారా పార్టీ ఎదుగులను దెబ్బకొట్టేసుకున్నారు. ఇందులో వెంకయ్యనాయుడు పాత్రకూడా తక్కువేమీ కాదు.





అప్పట్లోనే విభజనహామీలను తూచా తప్పకుండా అమలుచేసుంటే పార్టీ పరిస్ధితి ఇంత దారుణంగా ఉండేది కాదు. చేయాల్సిన డ్యామేజంతా మోడీ చేసేసి ఇక్కడ అధ్యక్షులను మార్చేస్తే అంతా సెట్టయిపోతుందని అనుకుంటే చాలా పొరబాటు. కాపుల ఓట్లకోసం తొమ్మిదేళ్ళు కాపు నేతలైన కన్నా లక్ష్మీనారాయణ, వీర్రాజుకు పగ్గాలిచ్చారు. ఎలాంటి ఉపయోగం కనబడలేదు. మళ్ళీ ఎన్నికలొస్తున్న సమయంలో సడెన్ గా కమ్మ సామాజికర్గం నేతైన పురందేశ్వరిని నియమించారు. ఈమె కూడా జనాకర్షణ ఉన్న నేతకాదు.





2009 ఎన్నికల్లో వైజాగ్ ఎంపీగా గెలిచిన పురందేశ్వరి 2019లో మళ్ళి పోటీచేస్తే వచ్చింది సుమారు 33 వేల ఓట్లు మాత్రమే. చంద్రబాబునాయుడు ఉండగా ఈమె కమ్మ సామాజికవర్గం ఓట్లను ఆకర్షించలేరు, అర్బన్ ఓట్లూ పడవు, మరి ఏమాసించి పురందేశ్వరి చేతికి పగ్గాలిచ్చారో  మోడీకే తెలియాలి. వీర్రాజు ప్లేసులో జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అపాయింటవుతారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా  పురందేశ్వరి రావటమే ఆశ్చర్యంగా ఉంది. ఏపీ ప్రయోజనాల విషయంలో మోడీ వైఖరి మారకుండా ఇక్కడ ఎంతమందిని అధ్యక్షులుగా మారిస్తే మాత్రం ఏమిటి ఉపయోగం ? 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: