అమరావతి : మిత్రపక్షం బీజేపీని పవన్ ముంచేస్తారా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమపై చేసిన హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలపై వాలంటీర్లు పెద్ద దుమారమే రేపుతున్నారు. సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీఎత్తున ర్యాలీలు, నిరసనలు, ధర్నాలతో హోరెత్తించారు. పవన్ పై యాక్షన్ తీసుకోవాలని డీజీపీకి, మహిళా కమీషన్ కు ఫిర్యాదులు చేశారు. తమపై చేసిన ఆరోపణలను వెంటనే పవన్ నిరూపించాలి లేదా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వాలంటీర్లు డిమాండ్లు చేస్తున్నారు.
ఒకవైపు ఇంతటి దుమారం రేగుతుంటే పవన్ మాత్రం తన మాటలకు కట్టుబడి ఉన్నానని చెబుతునే మరోసారి రెచ్చగొట్టారు. సరే పవన్ ఆరోపణల్లో వాస్తవాలు ఎంత ? మహిళా కమీషన్ జారీచేసిన నోటీసును లెక్కచేస్తారా లేదా అన్నది వేరేవిషయం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పవన్ చేసిన ఆరోపణలకు మద్దతుగా ప్రతిపక్షాల్లో ఒక్కటంటే ఒక్కపార్టీ కూడా నోరిప్పలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ ఒక్క మాటంటే చాలు వెంటనే మద్దతుగా టీడీపీ, సీపీఐ నేతలు రంగంలోకి దిగేస్తారు.
అలాంటిది ఇపుడు మాత్రం ఎవరు ఎందుకు నోరెత్తటంలేదు ? మిగిలిన ప్రతిపక్షాల సంగతి పక్కనపెట్టేసినా చివరకు మిత్రపక్షం బీజేపీ నేతలు కూడా నోరిప్పలేదు. తన ఆరోపణలతో బీజేపీని కూడా పవన్ రచ్చకీడ్చారనే చెప్పాలి. ఎందుకంటే పవన్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత బీజేపీపైన పడింది. తనకు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారం ప్రకారమే మాట్లాడుతున్నట్లు పవన్ చెప్పారు.
కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయంటే అదే సమాచారం కచ్చితంగా కేంద్ర హోంశాఖ దగ్గర కూడా ఉండే ఉంటుంది. మరిప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా యే సమాధానం చెప్పాలి. పవన్ ఆరోపణలు నిజమేనా లేకపోతే అబద్ధమా ? అని అమిత్ వివరణ ఇచ్చుకోవాలి. నోటికొచ్చింది మాట్లాడేసి పవన్ మిత్రపక్షం నేతలకు కూడా షాకిచ్చారనే చెప్పాలి. రాజకీయ ఆరోపణలు చేయటం వేరు ఇపుడు చేసిన హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు వేరు. పవన్ చేసిన ఆరోపణలపై మిత్రపక్షంతో పాటు ఇతర ప్రతిపక్షాలు ఎందుకు నోరిప్పటంలేదన్నది ఆశ్చర్యంగా ఉంది.