అమరావతి : చంద్రబాబుకే సమస్యగా మారుతున్నారా ?
అదేదో సినిమాలో ‘ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే’ అనే పాటుంది. చివరకు చంద్రబాబునాయుడు పరిస్ధితి కూడా అలాగే తయారయ్యేట్లుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలన్నది చంద్రబాబునాయుడు ఉద్దేశ్యం. ఎందుకంటే కేవలం కాపుల ఓట్లకోసమే. పవన్ వల్ల టీడీపీకి ఏదో ప్లస్సయిపోతుందన్నది చంద్రబాబు ఉద్దేశ్యం కానేకాదు. అచ్చంగా కాపుల ఓట్లు టీడీపీకి పడేట్లు చేసుకోవటం మాత్రమే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆలోచన.
అందుకనే పవన్ తో పొత్తుకు రెడీ అవుతున్నది. కానీ ఇపుడు పరిస్ధితి తిరగబడేట్లుగా ఉంది. ఎందుకంటే వారాహియాత్రలో పవన్ నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో తిరిగినన్నిరోజులు పదేపదే రెడ్లనే ఎటాక్ చేశారు. ప్రభుత్వంలో తప్పులు జరుగుతుంటే దానిపైన మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి పాలసీల్లో లోపాలుంటే దానిపైన విమర్శించాలి. ఎక్కడైనా అవినీతి జరుగుతుంటే దానిపైన నిలదీయాలి. అంతేకానీ వ్యక్తిగతంగా జగన్ మీద ద్వేషంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలపై బురదచల్లటంలో అర్ధంలేదు.
ఇక పశ్చిమగోదావరిలో యాత్ర మొదలవ్వగానే గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్లను పట్టుకుని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని ఆరోపించారు. దీంతో సుమారు 2.5 లక్షలమంది వాలంటీర్లు భగ్గుమంటున్నారు. విషయం ఏమిటంటే వాలంటీర్లలో మహిళల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఈ విషయాన్ని కూడా పవన్ ఆలోచించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడేశారు. దీనివల్ల ఏమైందంటే పవన్ అంటేనే వాలంటీర్లంతా మండిపోతున్నారు. దీని ప్రభావం రాబోయే ఎన్నికల్లో టీడీపీ మీదకూడా పడటం ఖాయంగానే ఉంది.
ఇంతకుముందు చంద్రబాబు కూడా వాలంటీర్లగురించి చాలా చీపుగా మాట్లాడారు. మగవాళ్ళు లేనపుడు వాలంటీర్లు వెళ్ళి ఆడవాళ్ళకోసం తలుపులు తడుతున్నారని, గోనెసంచులు మోసే వాలంటీర్ ఉద్యోగం కూడా ఒక ఉద్యోగమేనా అంటు చాలా అవహేళనగా మాట్లాడారు. తర్వాత తన తప్పుతెలుసుకుని మళ్ళీ ఎప్పుడూ మాట్లాడలేదు. అలాంటిది పవన్ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారనే పెద్ద ఆరోపణ చేయటంతో రాబోయే ఎన్నికల్లో జనసేనతో పాటు టీడీపీకి కూడా వాలంటీర్లంతా వ్యతిరేకంగా పనిచేయటం ఖాయమనే అనిపిస్తోంది. పవన్ వల్ల టీడీపీకి లాభంలేకపోగా పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఎక్కువైపోతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.