అమరావతి : పవన్ సెల్ఫ్ గోల్స్ వేసుకున్నారా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు విడతల వారాహియాత్రను పూర్తిచేశారు. ఓవరాలుగా యాత్ర ఎలా సాగిందని గమనిస్తే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అర్ధమైపోతుంది. ఇందుకు ఐదు కారణాలున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే పవన్ రాజకీయ నేతకాదు. కేవలం సినిమా సెలబ్రిటీ మాత్రమే. సెలబ్రిటీ కాబట్టి ఎక్కడ పర్యటించినా అభిమానుల తాకిడి విపరీతంగా ఉంటుంది. పైగా కాపు సామాజికవర్గం కూడా కావటంతో కొంత కాపు యూత్ కూడా పవన్ అంటే అభిమానంతో మీటింగులకు హాజరవుతారు.
వారాహియాత్రలో పవన్ చేసిన తప్పులేమిటంటే జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా తిట్టడమే. జగన్ పైన బురదచల్లటం కోసమే పవన్ యాత్ర చేస్తున్నారా అనే సందేహాలు పెరిగిపోయాయి. రెండో తప్పు ఏమిటంటే యాత్రలో కాకినాడ ఎంఎల్ఏ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై పదేపదే ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడటం. మూడో తప్పేమిటంటే నాలుగురోజులు తానే సీఎం అనిచెప్పి తర్వాత ఎల్లోమీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఏదో తన అభిమానుల కోసమే అలా చెప్పానని చెప్పారు. నాలుగో తప్పేమిటంటే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధ మీద నోటికొచ్చిన అబద్ధాలు చెప్పటం.
హ్యూమన్ ట్రాఫికింగ్ కు వాలంటీర్లే ప్రధాన కారణమన్నారు. వాలంటీర్ల నడుములు విరగొడ్డతానని, సచివాలయ వ్యవస్ధను రద్దుచేస్తానని ప్రకటించారు. మెజారిటి జనాలు సానుకూలంగా ఉన్న వ్యవస్ధలపై పనవ్ నోటికొచ్చింది మాట్లాడేయటం జనాలకు నచ్చలేదు. జనాలందరికీ ఎంతో ఉపయగంగా ఉన్న వ్యవస్ధలపై పవన్ ఎందుకు బురదచల్లేశారో అర్ధంకావటంలేదు.
ఆరో తప్పు ఏమిటంటే శ్రీకాళహస్తిలో తమ కార్యకర్త కొట్టేసాయిని సీఐ అంజూయాదవ్ చెంపదెబ్బ కొట్టడంపై పవన్ మండిపోయారు. జిల్లా ఎస్సీకి లేదా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళుంటే సరిపోయేది. అలాకాకుండా పశ్చిమగోదావరిలో యాత్ర చేసినన్ని రోజులు అంజూయాదవ్ గురించి పదేపదే ప్రస్తావించారు. జనసేన అధినేత ఒక మామూలు సీఐ గురించి అన్నిరోజులు మాట్లాడి తన స్ధాయిని తానే తగ్గించుకున్నట్లయ్యింది. ఇదే విషయమై తిరుపతికి వెళ్ళి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి యాక్షన్ తీసుకుంటాం వెళ్ళిరమ్మన్నారు. జరిగింది చూస్తుంటే యాత్రతో పవన్ కు ప్లస్ కన్నా మైనస్సులే ఎక్కువగా పడినట్లు అర్ధమవుతోంది.