అమరావతి : పురందేశ్వరి మాటలకు అర్ధాలే వేరా ?
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చాలా దూరం వెళ్ళిపోయారు. ఎంతదూరం అంటే బీజేపీ+జనేసేన సీఎం అభ్యర్ధిని తమ అధిష్టానమే నిర్ణయిస్తుందట. అంటే ఆమె ఉద్దేశ్యం రాబోయే ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ, జనసేనకు పొత్తుండదని పరోక్షంగా చెప్పటమేనా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. లేకపోతే బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావటం ఖాయమని చెప్పటమేనా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్ధి అనే విషయం వరకు ఆలోచించారంటేనే విచిత్రంగా ఉంది.
ఎందుకంటే రెండుపార్టీలకు కలిపి మహాయితే పట్టుమని 40 నియోజకవర్గాల్లో కూడా గట్టి అభ్యర్ధులు ఉండరు. మొత్తం 175 నియోజకవర్గాల్లో రెండుపార్టీల తరపున అభ్యర్ధులు ఎవరో ఒక్కళ్ళు నామినేషన్లు వేయటం పెద్ద కష్టమేమీకాదు. కానీ పోటీచేయబోయే ప్రత్యర్ధులకు ధీటైన అభ్యర్ధి అనిపించుకునేంత స్ధాయిలో జనసేన నుండి ఓ 20-30 నియోజకవర్గాల్లో అభ్యర్ధులుంటే చాలా ఎక్కువ. ఇక బీజేపీ సంగతిని చూస్తే ఓ పది నియోజకవర్గాల్లో కూడా గట్టి అభ్యర్దులు దొరకరు.
ఎందుకంటే కమలంపార్టీలో ఇపుడున్న ఆదినారాయణరెడ్డి, వరదాపురం సూరి లాంటి మరి కొద్ది మంది నేతలు వచ్చేఎన్నికల్లో బీజేపీ తరపునే పోటీచేస్తారో లేకపోతే టీడీపీలోకి తిరిగి వెళిపోతారో తెలీదు. కాబట్టి పోటీచేసే వాళ్ళందరికి ముందు డిపాజిట్లు వస్తే అదే చాలా ఎక్కువ. విషయం ఇంత స్పష్టగా కనబడుతున్నా సీఎం అభ్యర్ధిని అధిష్టానమే నిర్ణయిస్తుందని పురందేశ్వరి చెప్పటమే పెద్ద జోక్. ఇపుడు అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి పోయిన ఎన్నికల్లో వైజాగ్ ఎంపీగా పోటీచేస్తే వచ్చింది సుమారు 38 వేల ఓట్లు. అంటే డిపాజిట్టు కూడా దక్కలేదు.
బీజేపీలో చాలామంది నేతలు ఇదే బాపతు. ఈ విషయం ఆమెకు కూడా బాగా తెలుసు. అయినా సరే ఇందుకింత పెద్ద జోక్ చేశారో అర్ధంకావటంలేదు. దానికన్నా పవన్ కల్యాణే తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని బీజేపీ అధిష్టానం ప్రకటిస్తే ఎంతో కొంత ఉపయోగం ఉంటుందేమో పురందేశ్వరి కాస్త ఆలోచిస్తే మంచిది. లేకపోతే డిపాజిట్లకే కష్టపడాల్సుంటుంది.