రాయలసీమ : సంచలనం కోసమే ఇంత కుట్ర చేశారా ?
చంద్రబాబునాయుడుకున్న ప్రచారపిచ్చి అందరికీ తెలిసిందే. తాను ప్రచారంలో ఉండటం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఈ విషయం గతంలో చాలాసార్లు రుజువైంది. ఇపుడు పుంగనూరులో కూడా ఇదే నిర్ధారణైంది. సంచలనంతో పాటు కుట్రకు తెగించి పబ్లిసిటి తెచ్చుకోవటమే చంద్రబాబు ప్లానని పోలీసుల విచారణలో తమ్ముళ్ళ ద్వారా బయపడిందట. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో చంద్రబాబు యుద్దభేరి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈనెల 1వ తేదీన మొదలుపెట్టిన కార్యక్రమం ఏదో పర్వాలేదన్నట్లుగా జరిగింది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో ప్రధానంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు తప్ప మామూలుజనాలు పాల్గొన్నది దాదాపు లేదనే చెప్పాలి.
కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నియోజకవర్గంతో మొదలైన యాత్ర అనంతపురం జిల్లావరకు చప్పగా జరిగింది. మధ్యలో ముచ్చుమర్రి ప్రాజెక్టు దగ్గరకు వెళ్ళే దారిలో అసలు జనాలే కనబడలేదు. మామూలు జనాలు కాదు కదా చివరకు పార్టీ నేతలు కూడా కనడడలేదు. దాంతో అప్రమత్తమైన సెంట్రల్ ఆఫీసు కడప జిల్లానేతలకు ఫోన్లు చేసి జాగ్రత్తపడ్డారు. అందుకనే పులివెందుల రోడ్డుషోలో పార్టీజనాలు విపరీతంగా కనబడ్డారు. దాన్నే ఎల్లోమీడియా చంద్రబాబుకు జనాలు బ్రహ్మరథం అని ప్రచారంచేసింది.
సరే, అనంతపురం జిల్లా నుండి చిత్తూరు జిల్లాలోకి యాత్ర ప్రవేశించిన సమయానికి పార్టీ నేతలే తప్ప మామూలు జనాలు లేరు. పేరుకు చిత్తూరు చంద్రబాబు సొంతజిల్లానే అయినా ఆదరణ మొదటినుండి తక్కువే. ఎందుకంటే ప్రత్యేకించి జిల్లా అభవృద్ధికి చేసిందేమీలేదు. జిల్లాను ఓన్ చేసుకున్నది కూడా లేదు. ఈ కారణంగానే మామూలు జనాలు చంద్రబాబును పట్టించుకోరు. అప్పటికే యాత్ర మొదలుపెట్టి నాలుగురోజులైనా అనుకున్నంత ప్రచారం రావటంలేదు.
అందుకనే పుంగనూరు బైపాస్ రోడ్డు మీదుగా చిత్తూరు వెళ్ళాల్సిన చంద్రబాబు సడెన్ గా పుంగనూరు టౌన్లోకి ఎంటరయ్యారు. ఇంకేముంది నాలుగురోజుల యాత్రలో రాని ప్రచారం మూడుగంటలల్లో వచ్చేసింది. రెండురోజులుగా ఎల్లోమీడియా మొత్తం చంద్రబాబు, పుంగనూరు అల్లర్లనే హైలైట్ చేసింది. కొద్దిరోజులుగా రాజకీయాలు, ప్రచారం మొత్తం వైసీపీ వర్సెస్ పవన్ కల్యాణ్ గా సాగుతోంది. ప్రచారంలో పూర్తిగా వెనక్కు వెళ్ళిపోయాననే బాధతోనే చంద్రబాబు కావాలనే పుంగనూరులోకి ఎంటరై గొడవలు సృష్టించినట్లు అర్ధమవుతోంది. తన ప్రచారం కోసం ఎంతమందినైనా సరే ఎరగా వేయటానికి చంద్రబాబు ఏమాత్రం వెనకాడరని మరోసారి రుజువైంది.