అమరావతి : మూడు పేర్లు బయటకు వచ్చాయా ?

Vijaya


రాబోయే ఎన్నికల్లో పోటీచేయాల్సిన అభ్యర్ధులపై పార్టీల అధినేతలందరు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నారు. అక్కడక్కడ అభ్యర్ధుల పేర్లు బయటకు వస్తున్నా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఇలాంటి నేపధ్యంలోనే విజయవాడ సిటీలోని మూడు నియోజకవర్గాల అభ్యర్ధుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించటం ఆశ్చర్యంగా ఉంది. మీడియా ముందు సజ్జల చేసిన ప్రకటనంటే అది అధికారిక ప్రకటనగానే అనుకోవాల్సుంటుంది.



జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ అభ్యర్ధులను ప్రకటించిందిలేదు. ఏ ఎన్నికల్లో అభ్యర్ధులను ప్రకటించినా సజ్జల ప్రకటించాల్సిందే. అంటే జగన్ తరపున సజ్జలే అభ్యర్ధులను ప్రకటిస్తారని అనుకోవాలి. అలాంటిది ఇపుడు సజ్జల ముగ్గురు అభ్యర్ధులను ప్రకటించారంటే అది జగన్ వాయిస్ అనే అనుకోవాలి. ఇంతకీ విషయం ఏమిటంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్, విజయవాడ సెంట్రల్ నుండి మల్లాది విష్ణు పోటీచేస్తారని ప్రకటించారు.



రాబోయే ఎన్నికల్లో పై ముగ్గురు అభ్యర్ధులను మంచి మెజారిటితో గెలిపించాలని జనాలను సజ్జల విజ్ఞప్తిచేశారు. దాంతో పై ముగ్గురిని పార్టీ అధికారికంగా ప్రకటించినట్లయ్యింది. అయితే ఇక్కడ అనుమానం ఏమిటంటే సజ్జల పై ముగ్గురిని మాత్రమే ఎందుకు ప్రకటించారనేది అర్ధంకావటంలేదు. పైగా ఇందులో రెండు సిట్టింగ్ స్ధానాలే. వెల్లంపల్లి, మల్లాది సట్టింగ్ ఎంఎల్ఏలు అయితే దేవినేని అవినాష్ ఫ్రెష్ అభ్యర్ధి.



సజ్జల తాజా ప్రకటన చూస్తుంటే మెల్లిమెల్లిగా అభ్యర్ధులను ప్రకటించేయాలని జగన్ డిసైడ్ అయినట్లున్నారు. 175 నియోజకవర్గాల్లో  మొదటిజాబితాగా 70 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ప్రకటన జరుగుతుదని ప్రచారం జరుగుతోంది. ఆ 70 మంది పేర్లను తొందరలోనే ప్రకటించాలని జగన్ లిస్టు రెడీ చేస్తున్నారని పార్టీలోనే టాక్ వినబడుతోంది. ఇంతలో సజ్జల ముగ్గురి పేర్లను ప్రకటించారు. కాబట్టి మిగిలిన అభ్యర్ధుల పేర్లను కూడా వీలుచూసుకుని ఇన్ స్టాల్ మెంట్లుగా ప్రకటించేస్తారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి తర్వాత జాబితాలో ఎంతమంది ఉంటారో ? ఏ ఏ నియోజకవర్గాలుంటాయో అనే ఆసక్తి ఒక్కసారిగా పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: