హైదరాబాద్ : అలిగిన మోత్కుపల్లి...ఎప్పుడూ ఇంతేనా ?
చెప్పుకోవటానికి సీనియారిటి చాలా సంవత్సరాలే ఉంది. కానీ అత్యాశ, తన స్ధాయిని తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకోవటంతోనే సమస్యలు పెరిగిపోతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆలేరుకు చెందిన ఈ మాజీమంత్రి మోత్కుపల్లికి ఎవరితోను పడదు. తాను అనుకున్నది పార్టీ అధినేత ఇస్తేనే లాయల్ గా ఉంటారు. లేకపోతే వెంటనే అసంతృప్తి వ్యక్తంచేస్తారు. తర్వాత అసమ్మతివాదిగా మారిపోతారు. అప్పటికీ లాభంలేదని అనుకుంటే తిరుగుబాటు చేస్తారు.
ఇక్కడ విషయం ఏమిటంటే మోత్కుపల్లి టీడీపీలో చేరటంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. తర్వాత కాంగ్రెస్ లోకి మారారు. ఆ తర్వాత మళ్ళీ టీడీపీలో చేరారు. అక్కడ పడటంలేదని బీఆర్ఎస్ లో చేరారు. ఇపుడు ఆలేరులో తనకు టికెట్ ఇవ్వలేదని కేసీయార్ పై అలిగారు. అంటే బీఆర్ఎస్ లో నుండి బయటకు రావటానికి మోత్కుపల్లికి ఎంతోకాలం పట్టదనే సెటైర్లు పేలుతున్నాయి. బహుశా బీజేపీలో చేరుతారని అనుకుంటున్నారు.
ఎందుకంటే తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్ళలేరు. కారణం ఏమిటంటే మొదటిది పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఒక్క నిముషం కూడా పడదు. అలాగే కాంగ్రెస్ లో మోత్కుపల్లికి టికెట్ గ్యారంటీలేదు. రేవంత్ తో పడక, టికెట్ గ్యారెంటీ లేనపుడు ఇక మోత్కుపల్లి కాంగ్రెస్ లో చేరి ఏమిచేస్తారు ? అదే బీజేపీలో అయితే కాస్త వెసులుబాటు ఉంటుంది.
కమలంపార్టీలో నేతల కొరత బాగా ఎక్కువగా ఉంది కాబట్టి మోత్కుపల్లి బీజేపీలో చేరినా కాస్త మర్యాద దక్కుతుంది. అలాగే ఆలేరులో టికెట్ దక్కే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంది. ఒకవేళ ఆలేరులో టికెట్ దక్కకపోయినా ప్రత్యామ్నాయంగా మరో నియోజకవర్గంలో టికెట్ ఖాయం. మద్దతుదారులతో ఈ మాజీమంత్రి సమావేశం పెట్టుకున్నారు. మరి సమావేశంలో మద్దతుదారులు ఏమి చెబుతారు ? ఏమి సూచిస్తారో చూడాలి. దాన్నిబట్టి మోత్కుపల్లి తన భవిష్యత్ రాజకీయాన్ని నిర్ణయించుకుంటారు. ఏదేమైనా ఇప్పటికే ఇన్నిపార్టీలు మారిన మోత్కుపల్లిని జనాలు అసలు ఆధరిస్తారా అన్నదే అసలైన పాయింట్.