అమరావతి : జగన్ పెనాల్టి చెల్లించాల్సిందేనా ?

Vijaya


తెలిసిచేసినా తెలియకచేసినా తప్పు తప్పే. ఇందులో రెండు అంశానికి తావులేదు. అలాంటిది తప్పు కూడా ఉద్దేశ్యపూర్వకంగానే చేస్తే ? ఇపుడు జగన్మోహన్ రెడ్డి చేసిందిదే. అన్నీ తెలిసే జగన్ తప్పుచేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్ట్ బోర్డు పాలకమండలిలో శరత్ చంద్రారెడ్డిని నియమించారు. పాలకమండలిలో ఎవరిని నియమించాలన్నది పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణే అనటంలో సందేహంలేదు.





కాకపోతే నియమించేటపుడే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆరోపణలను ఎదుర్కొంటున్న వాళ్ళని సభ్యులుగా నియమిస్తే ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలతో అందరు రెచ్చిపోతారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళనే నియమించకూడదన్నపుడు ఇక ఏకంగా నిందితులనే నియమిస్తే అందులోను చేసిన నేరాన్ని అంగీకరించిన వ్యక్తిని నియమించటం ఇంకెంత తప్పు ? విషయం ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పీకల్లోతు కూరుకుపోయిన శరత్ చంద్రారెడ్డిని బోర్డు సభ్యుడిగా జగన్ నియమించారు.





లిక్కర్ స్కామ్ లో కూరుకుపోవటమే కాదు అందులో నుండి బయటపడటానికి అప్రూవర్ గా మారిపోయారు. అప్రూవర్ గా మారారంటేనే నేరాన్ని అంగీకరించినట్లే లెక్క. విచారణ తర్వాత శరత్ కు కోర్టు ఏమి శిక్ష విధిస్తుందన్నది వేరే సంగతి. ఈడీ అరెస్టుచేసిన దగ్గర నుండి కోర్టు బెయిల్ కూడా ఇవ్వలేదు. చివరకు అప్రూవర్ గా మారటం, భార్యకు అనారోగ్యంగా ఉందని చెప్పి మెడికల్ గ్రౌండ్స్ లో బెయి పిటీషన్ వేస్తేకానీ కోర్టు బెయిల్ ఇవ్వలేదు.





ఇలాంటి వ్యక్తికి మించిన వ్యక్తి జగన్ కు దొరకనేలేదా ? శరత్ కు పాలకమండలిలో సభ్యత్వం కోసం జగన్ పైన ఎంత ఒత్తిడి అయినా వచ్చుండచ్చు. అంతమాత్రాన కోర్టు విచారణలో ఉన్న వ్యక్తిని, బెయిల్ మీద బయటున్న వ్యక్తికి టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇవ్వటం చాలా తప్పు. అసలే జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి టీటీడీ గబ్బుపట్టిపోయిందనే ఆరోపణలు, విమర్శలకు కొదవేలేదు. ఇలాంటి సమయంలో నిందితులకు కూడా బోర్డులో సభ్యత్వం ఇచ్చేస్తే ఇక ఆలయం, పవిత్రతను జగన్ ఏమి కాపాడుతున్నట్లు ? పవిత్రపుణ్యక్షేత్రంగా భక్తులు కొలిచే తిరుమలను జగన్ ఏమిచేయదలచుకున్నట్లు ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: