అమరావతి : ఎల్లోమీడియా ప్రకారం కొడాలికి టికెట్ ఉండదా ?
ఎల్లోమీడియా 24 గంటలూ 365 రోజులు ఒకే టార్గెట్ మీద పనిచేస్తుంటుంది. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి మీద బురదచల్లేయటం. లేకపోతే జగన్ సన్నిహితులు అనుకున్న వాళ్ళని ఎలా విడదీయటం అనే విషయంమీదే కథనాలను వండి వార్చుతుంటుంది. ఇపుడిదంతా ఎందుకంటే వచ్చేఎన్నికల్లో గుడివాడలో కొడాలినానికి టికెట్ ఇవ్వటంలేదట. గుడివాడలో కొడాలికి బదులుగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి టికెట్ ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారని పెద్ద కథనం అచ్చేసింది.
రాబోయే ఎన్నికల్లో తాను మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయనని వంశీ చెప్పారట. ఎక్కడినుండైనా ఎంఎల్ఏగా పోటీచేయాలని అనుకుంటున్నట్లు జగన్ తో వంశీ అన్నారట. గుంటూరు, కృష్ణా జిల్లాలో ఎక్కడా నియోజకవర్గం ఖాళీలేదు. అయితే అడిగింది తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకళ్ళైన వంశీ కదా. అందుకనే వెంటనే జగన్ కన్ను గుడివాడ మీదపడిందట. తన కోసం ప్రాణం ఇమ్మన్నా ఇచ్చేందుకు రెడీగా ఉండే కొడాలి నాని తాను అడిగితే నియోజకవర్గాన్ని ఖాళీ చేయడా అని జగన్ ఆలోచించారట.
రాబోయే ఎన్నికల్లో గుడివాడలో పోటీచేయద్దని నానీకి జగన్ చెప్పబోతున్నారట. ఇందులో భాగంగానే ఎంపీని గుడివాడలో పనిచేసుకోమని చెప్పేశారట. అందుకనే ఎంపీ రెగ్యులర్ గా గుడివాడలో పర్యటిస్తున్నారట. ఏదో సమయం చూసుకుని కొడాలిని పిలిపించుకుని రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వటం కుదరదని చెప్పాలని జగన్ అనుకుంటున్నారట. రెగ్యులర్ గా ఎంపీ గుడివాడలో తిరుగుతున్న విషయం ఎంఎల్ఏకి కూడా చెప్పటంలేదట.
ఇదే విషయాన్ని ఎంఎల్ఏ మద్దతుదారులు ప్రస్తావించి జగన్ పైన మండిపోతున్నారట. తన మద్దతుదారులతో కొడాలి కూడా సమావేశం పెట్టుకున్నారట. ఈ విషయాన్ని మాట్లాడి జగన్ తో తాడేపేడో తేల్చుకోవటానికి కొడాలి రెడీ అయిపోయారట. ఇంకేముంది ఇటు కొడాలి పనైపోయింది అటు జగన్ పనికూడా అయిపోయిందని ఎల్లోమీడియా బుర్రకు తోచిన రాతలను గీకిపడేసింది. ఇక్కడ విషయం ఏమిటంటే ఎలాగైనా జగన్-కొడాలి మధ్య గ్యాప్ పెంచాలన్నదే ఎల్లోమీడియా టార్గెట్. ఇలాంటి టార్గెట్లతోనే ఈమధ్య ఇలాంటి అనేక కథనాలను వండివారుస్తోంది. మరి ఎల్లోమీడియా టార్గెట్ ఎప్పటికైనా రీచవుతుందో లేదో చూడాలి.