అమరావతి : మరీ ఇంత ఓవర్ యాక్షనా ?
అరెస్టయి 14 రోజుల రిమాండుకు వెళ్ళింది చంద్రబాబునాయుడు అయితే ఓవర్ యాక్షన్ చేస్తున్నది జనసేన అధినేత పవన్ కల్యాణ్. విచిత్రం ఏమిటంటే పవన్ చేస్తున్న ఓవర్ యాక్షన్ లాగ టీడీపీ నేతలే చేయటంలేదు. పవన్ వైఖరికి తమ్ముళ్ళే ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు అరెస్టయ్యారని తెలియగానే శనివారం మధ్యాహ్నానికి ప్రత్యేకవిమానంలో విజయవాడ వద్దామని అనుకున్నారు. అయితే అందుకు పోలీసులు అనుమతించలేదు. విమానాశ్రయం అధికారులతో మాట్లాడి పవన్ వద్దామని అనుకున్న ప్రత్యేక విమానం ల్యాండింగ్ కు అనుమతి నిరాకరించేట్లు చేశారు.
దాంతో పవన్ రోడ్డుమార్గంలో వచ్చారు. మధ్యలో చింతమాకులపల్లి దగ్గర పోలీసులు అడ్డుకుంటే రోడ్డుపైనే కూర్చుని గోలగోల చేశారు. అంతేకాకుండా పోలీసులను తిడుతు రోడ్డుపైనే పడుకుని నిరసన వ్యక్తంచేశారు. ఇపుడు టీడీపీ ఇచ్చిన బంద్ పిలుపుకు మద్దతు ప్రకటించారు. ఇదంతా చూస్తున్న జనసేన నేతలకు కూడా పవన్ కు ఏమైంది అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు అరెస్టయ్యింది రాజకీయ కారణాలతో కాదు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కామ్ లో రు. 371 కోట్లు దోచుకున్నందుకు.
చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు రికార్డులతో సహా సీఐడీ నిరూపించింది. చంద్రబాబు బలవంతంమీదే అప్పటి చీఫ్ సెకట్రరి, ఫైనాన్స్ సెక్రటరిలు నిధులు విడుదల చేస్తున్న రాసిన నోట్ ఫైల్స్ ను కూడా సీఐడీ కోర్టులో జడ్జికి చూపించింది. ఇదే సమయంలో చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని ఆయన తరపున వాదించిన సిద్ధార్ధ లూథ్రా చేసిన వాదనలు చాలా పేలవంగా ఉంది.
లూథ్రా వాదనల్లో పసలేదు కాబట్టే జడ్జి చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. చంద్రబాబు అవినీతి ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా పవన్ మాత్రం అంగీకరించటంలేదు. చంద్రబాబును అన్యాయంగా, అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని పదేపదే బల్లగుద్ది మరీ పవన్ చెబుతుండటమే విచిత్రంగా ఉంది. అంటే చంద్రబాబుకు అంటుకున్న అవినీతి బురదను పవన్ తాను కూడా పూసుకుంటున్నారని అర్ధమవుతోంది. చంద్రబాబుకు అంటిన బురదను తాను కూడా పూసుకోవటాన్ని జనాలు ఆశ్చర్యంగా చూస్తున్నారు.