హైదరాబాద్ : బిగ్ ట్విస్ట్...కవితకు నోటీసులు

Vijaya


ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణాకు సంబంధించి బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అదేమిటంటే స్కామ్ లో కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేసింది. ఈనె 16వ తేదీన ఢిల్లీలోని తమ ఆఫీసులో  విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులో చెప్పింది. చివరిసారిగా మార్చి 16,20,21 తేదీల్లో ఈడీ కవితను విచారించింది. ఇక్కడ విషయం ఏమిటంటే కవిత బినామీగా ప్రచారంలో ఉన్న అరుణ్ రామచంద్రపిళ్ళై స్కామ్ లో అప్రూవర్ గా మారిపోయారు.





పిళ్ళై అప్రూవర్ గా మారిన రెండురోజులకే విచారణకు రమ్మని  ఈడీ కవితకు నోటీసులు జారీచేయటం గమనార్హం. ఈసారి విచారణ తర్వాత కవితను ఈడీ అరెస్టు చేస్తుందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కవిత వ్యవహారాలన్నీ పిళ్ళైకి బాగా తెలుసని అనుకుంటున్నారు. అలాంటి పిళ్ళై అప్రూవర్ గా మారినపుడు కవితకు సంబంధించిన ఎలాంటి వివరాలు చెప్పారన్నది కీలకంగా మారింది.





స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధంలేదని కవిత మొదటినుండి చెబుతున్నారు. అయితే ఈమె వాదనను ఈడీ నమ్మటంలేదు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టుతో పాటు కోర్టులో దాఖలుచేసిన చార్జిషీట్లో కూడా కవిత పాత్రపై  ఈడీ చాలా చోట్ల ప్రస్తావించింది. సౌత్ గ్రూపులో కవిత పాత్రే స్కామ్ లో చాలా కీలకమని ఈడీ నమ్ముతోంది. అయితే ఏ కారణంతో చాలామందిని అరెస్టుచేసిన ఈడీ కవితను మాత్రం ఇంతకాలం విడిచిపెట్టిందన్నది సస్పెన్సుగా మారింది.





దీనికి కారణం బీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలిపిన కారణంగానే ఈడీ కవితను అరెస్టు చేయలేదని కాంగ్రెస్ నేతలు పదేపదే ఆరోపిస్తున్నారు. తెలంగాణా పర్యటనల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి కూడా ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఎన్నికలు వస్తున్న నేపధ్యంలో ఇదే అంశం బీజేపీ మీద చాలా బ్యాడ్ ఇమేజిని తెచ్చింది. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని జనాలు కూడా నమ్ముతున్నారు. దీంతో తెలంగాణాలో బీజేపీ పరిస్ధితి అన్యాయమైపోయింది. రాబోయే ఎన్నికలకు బీజేపీ పుంజుకోవాలంటే కవితను ఈడీ అరెస్టు చేయాల్సిందే అని బీజేపీ తెలంగాణా నేతలు కేంద్రంతో చెప్పారని సమాచారం. దాని ఫలితమే కవితకు నోటీసులట. మరి విచారణలో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: