అమరావతి : రామోజీకి నడ్డా సర్టిఫికేటా ?
రామోజీరావు దార్శనికుడు..ఈ సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరో కాదు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. చీటింగు కేసులో నిండా ముణిగిపోయిన రామోజీరావుకు జేపీ నడ్డా సర్టిపికేట్ ఇవ్వటం ఆశ్చర్యంగా ఉంది. రామోజీని దార్శనికుడని నడ్డా సర్టిఫికేట్ ఇచ్చారంటే ఎందులో దార్శనికుడు ? అని సోషల్ మీడియాలో విపరీతమైన సెటైర్లు పేలుతున్నాయి. వేలాది కోట్ల రూపాయల మార్గదర్శి చీటింగ్ కేసులో రామోజీ నిండా ముణిగిపోయున్నారు.
కేసుల నుండి ఎలా బయటపడాలో అర్ధంకాక సీఐడీ విచారణను కూడా ఎగ్గొడుతున్నారు. సీఐడీ అధికారులు విచారణకు ఇంటికొస్తే తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నట్లుగా రామోజీ మంచంమీద పడుకునే విచారణను ఎదుర్కొన్నారు. విచారణకు తమ ఆఫీసుకు రమ్మని నోటీసులిస్తే అనారోగ్యం కారణంగా రాలేనని చెప్పి తప్పించుకుంటున్నారు. అలాంటి రామోజీ, ఫిలింసిటీకి వచ్చిన జేపీ నడ్డా, కేంద్ర మాజీమంత్రి ప్రకాష్ జవదేకర్ ను రిసీవ్ చేసుకోవటమే కాకుండా వాళ్ళతో చాలాసేపు హుషారుగా గడిపారు.
సీఐడీ విచారణ సమయంలో ఉన్న అనారోగ్యం ఇపుడు ఏమైపోయిందని నెటిజన్లు ఫుల్లుగా సెటైర్లు పేల్చుతున్నారు. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే చీటింగ్ కేసులో ముణిగిపోయి, విచారణను కూడా గైర్హాజరవుతున్న రామోజీలో నడ్డాకు దర్శనికుడు కనిపించటం ఏమిటో అర్ధంకావటంలేదు. సినిమా ఫీల్డులోను, మీడియా రంగంలో ఉంటే చాలు తాను ఎలాంటి మోసాలకు పాల్పడినా అడగకూడదన్నట్లుగా రామోజీ వ్యవహరిస్తున్నారు. మార్గదర్శి మోసాలు కోర్టులో ఇప్పటికే రుజువైనట్లు చాలాకాలంగా రామోజీ మోసాలపై పోరాటం చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. మార్గదర్శి మోసాలను కోర్టు విచారణ పూర్తిచేసి తీర్పు ఇవ్వటం ఒకటే మిగిలిందని ఉండవల్లి చాలాసార్లు చెప్పారు.
అలాంటి రామోజీని దార్శినికుడని నడ్డా సర్టిఫికేట్ ఇవ్వటంలో అర్ధమేంటి ? తన మోసాలకు, అక్రమాలకు రామోజీ మీడియాను అడ్డుపెట్టుకుంటున్నారని చాలాసార్లు స్పష్టమైంది. ఎందుకంటే మార్గదర్శిలో మోసాలు జరుగుతున్నాయని దాడులు చేసి సోదాలు చేసినపుడల్లా మీడియా మీద దాడిగా రామోజీ ఫస్ట్ పేజీలో వార్తలు అచ్చేస్తున్నారు. ఈ విషయాలు తెలీకుండానే రామోజీకి నడ్డా దార్శినికుడని సర్టిఫికేట్ ఇచ్చారా ? లేకపోతే తెరవెనుక ఏదైనా మంత్రాంగం నడుస్తోందా ?