హైదరాబాద్ : పవన్ కు షాకిచ్చిన జనసేన పార్టీ

Vijaya

హెడ్డింగ్ కాస్త కన్ఫ్యూజన్ గా ఉందా ? కథనంలోకి వెళితే అంతా క్లియర్ అవుతుంది. తెలంగాణా ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పార్టీ పొత్తులో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్న విషయం తెలిసిందే. జనసేన 8 నియోజకవర్గాల్లో పోటీచేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్ పల్లితో పాటు కోదాడ, తాండూరు, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, వైరా, అశ్వారావుపేట, మధిర, కొత్తగూడెం సీట్లకు నామినేషన్లు కూడా వేశారు.



ఇక్కడే ట్విస్టంతా ఉంది. అదేమిటంటే జనసేనతోపాటు జనసేనను పోలి ఉండే జాతీయ జనసేనపార్టీ తరపున కూడా కూకట్ పల్లి  నియోజకవర్గంలో నామినేషన్ దాఖలైంది. జాతీయ జనసేన పార్టీ గుర్తు నీళ్ళ బక్కెట్. జనసేన గుర్తు గాజుగ్లాసని అందరికీ తెలిసిందే. అయితే గుర్తింపులేని కారణంగా జనసేన గుర్తు గాజుగ్లాసును ఎన్నికల కమీషన్  ఫ్రీ సింబల్ గా ఉంచింది. అయితే నామినేషన్ దాఖలుపై జనసేన అభ్యర్ధికి లేదా ఎవరో ఒక ఇండిపెండెంటుకు ఆ గుర్తు దక్కే అవకాశముంది.



ఇదే సమయంలో జాతీయ జనసేన పార్టీ గుర్తు బక్కెట్ కూడా ఉంటుంది. ఓటర్లకు గాజుగ్లాసు, బక్కెట్ చూడటానికి ఒకటేలా కనబడతాయి. అపుడు జనసేనకు ఓట్లేయాలని అనుకునే వాళ్ళు పొరబాటున బక్కెట్ గుర్తుకు ఓట్లేసే అవకాశాలు లేకపోలేదు. దీంతో తెలంగాణాలో మొదటిసారి పోటీచేస్తున్న జనసేనకు, జాతీయ జనసేన పార్టీ గట్టి షాకివ్వటం ఖాయమనే అనిపిస్తోంది. జనసేన తరపున ప్రేమ్ కుమార్ నామినేషన్ వేశారు. జాతీయ జనసేన పార్టీ తరపున కొనింటి పవన్ కల్యాణ్, నాగ వెంకట వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. బీ ఫారం అందించిన వాళ్ళే పార్టీ అభ్యర్ధిగా నిలుస్తారు.



పోస్టర్లు, పాంప్లెట్లు, కటౌట్లు, అడ్వర్టైజ్మెంట్లతో పాటు చివరకు ఈవీఎంల్లో కూడా గాజుగ్లాసు గుర్తు, నీళ్ళ బక్కెట్ గుర్తు చూడటానికి దాదాపు ఒకేలా ఉంటాయి. తెలంగాణాలో అసలే అంతంతమాత్రంగా ఉన్న జనసేనను దెబ్బకొట్టడానికి ఎవరో జాతీయ జనసేనపార్టీని రంగంలోకి దింపినట్లు అర్ధమవుతోంది. బాగా దగ్గరి పోలికలున్న గుర్తులతో ఎలాంటి సమస్యలు వస్తాయో బీఆర్ఎస్ అభ్యర్ధులను అడిగితే బాగా చెబుతారు. మరి జాతీయ జనసేన పార్టీ తరపున కూకట్ పల్లిలో మాత్రమేనా ఇంకా మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పోటీచేస్తున్నారా లేదా అన్నది తేలాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: