హైదరాబాద్ : బర్రెలక్క చెమటలు పట్టిస్తోందా ?
ఓటమో గెలుపో తర్వాత సంగతి. ఇప్పటికైతే పోటీచేస్తున్న ప్రత్యర్ధులను బర్రెలక్క అలియాస్ శిరీష చెమటలు పట్టించేస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద పార్టీలతో పాటు ఒక స్వతంత్ర అభ్యర్ధి శిరీష్ కూడా పోటీచేస్తోంది. కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఫిరాయింపు ఎంఎల్ఏ బీరం హర్షవర్ధనరెడ్డి, బీజేపీ తరపున సుధాకర్ పోటీచేస్తున్నారు.
వాస్తవంగా చూస్తే పై మూడు పార్టీల తరపున పోటీచేస్తున్న అభ్యర్ధులతో పోల్చితే బర్రెలక్క ఏ విధంగాను పోటీ ఇవ్వలేందు. కానీ గ్రౌండ్ రియాలిటి ఏమిటంటే పై ముగ్గురి కన్నా బర్రెలక్కకే విపరీతమైన ప్రచారం జరుగుతోంది. కారణం ఏమిటంటే అసలు బర్రెలక్క అన్న పేరే విచిత్రంగా ఉంది. ఎంత చదువు చదివినా ఉద్యోగం రావటంలేదు కాబట్టి తాను బర్రెలను కాచుకుంటున్నట్లు శిరీష్ ఏడాదిన్నర్ క్రితం చేసిన సోషల్ మీడియాలో పెట్టిన రీల్ చాలా పాపులరైంది. అప్పటినుండి శిరీష పేరు బర్రెలక్కగా పాపులరైపోయింది.
తాజా ఎన్నికల్లో నిరుద్యోగుల ప్రతినిధిగా ప్రభుత్వంపై మంటతో తాను ఇండిపెండెంటుగా పోటీచేస్తున్నట్లు చెప్పి నామినేషన్ వేసింది. నామినేషన్ వేసినపుడు బర్రెలక్కను ఎవరు పట్టించుకోలేదుకాని తర్వాత సోషల్ మీడియాలో కొందరు ప్రచారం మొదలుపెట్టడంతో ఆమె పాపులారిటి మొదలైంది. చివరకు ప్రచారం తదితర ఖర్చుల కోసం స్వచ్చంధంగా అన్నీ ప్రాంతాల వాళ్ళు బర్రెలక్కకు విరాళాలు ఇస్తున్నట్లు ప్రకటించటంతో ప్రచారం బాగా పెరిగిపోయింది. యానాం మాజీ ఎంఎల్ఏ, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు లక్ష రూపాయలు ఇచ్చినట్లే ఏపీ నుండి కూడా చాలామంది విరాళాలను డిజిటల్ పేమెంట్ రూపంలో పంపుతున్నారు.
ఇదే సమయంలో ప్రచారంలో ఉన్న సమయంలో బర్రెలక్క సోదరుడిపై దాడి జరగటంతో పాపులారిటి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇపుడు సోషల్ మీడియాలో బర్రెలక్కకు ఓట్లేయమని, గెలిపించమని నెటిజన్లు స్వచ్చంధంగా ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం పెరిగిపోతుండటంతో వేరేదారి లేక మీడియా కూడా ప్రచారం చేయాల్సొస్తోంది. దీంతో మిగిలిన ముగ్గురు అభ్యర్ధులకు చెమటలు పడుతున్నాయి.