హైదరరాబాద్ : ఇద్దరిదీ ఒకేరకమైన సమస్యా ?

Vijaya

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీయార్ ఇద్దరు దాదాపు ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. అదేమిటంటే ప్రభుత్వాన్ని సుస్ధిరం చేసుకోవటానికి రేవంత్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. ఇదే సమయంలో ఎన్నికైన పార్టీ ఎంఎల్ఏలను కాపాడుకోవటంలో కేసీయార్ కూడా అంతే శ్రమపడాల్సుంటుంది. మొన్ననే ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో హస్తంపార్టీ తరపున 64 మంది ఎంఎల్ఏలు ఎన్నికయ్యారు.



119 సీట్లలో ప్రభుత్వ ఏర్పాటుకు 60 సీట్ల మెజారిటి దాటితే చాలు. కాంగ్రెస్ కు వచ్చింది 64 సీట్ల చాలా సింపుల్ మెజారిటి మాత్రమే. ఐదుమంది ఎంఎల్ఏలను లాగేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. కేసీయార్ అదే వ్యూహాల్లో ఉన్నారని బీఆర్ఎస్ తరపున ఎన్నికైన కడియం శ్రీహరి లాంటి వాళ్ళ ప్రకటనల్లో అర్ధమవుతోంది. అన్నీ పార్టీలు అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కడియం చెప్పటం గమనార్మం. అందుకనే తన ప్రభుత్వం ఎప్పుడైనా సరే కూలిపోయే అవకాశముందని రేవంత్ కు కూడా బాగా తెలుసు. అందుకనే బీఆర్ఎస్ ఎంఎల్ఏలను లాక్కోవటం మినహా వేరే దారిలేదు. బీజేపీ నుండి ఒక్క నిర్మల్ ఎంఎల్ఏ మహేశ్వరరెడ్డి మాత్రమే కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందంటున్నారు.



ఇదే సమయంలో బీఆర్ఎస్ నుండి ఎంఎల్ఏలను లాక్కుని బలపడాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ఎందుకంటే బీజేపీ బలపడాలంటే బీఆర్ఎస్ ను చీల్చాల్సిందే.  కాంగ్రెస్ అధికారంలో ఉందికాబట్టి హస్తంపార్టీ ఎంఎల్ఏలు ఎవరూ బీజేపీలో చేరే అవకాశాలు లేవు. కాబట్టి బీఆర్ఎస్ ఎంఎల్ఏలు లాక్కునేందుకు  మాత్రమే బీజేపీకి అవకాశముంది.



ఇతర రాష్ట్రాల్లో బీజేపీ బలపడిన విధానం చూస్తే ముందు బీఆర్ఎస్ ఎంఎల్ఏలను లాక్కునేందుకే కమలంపార్టీ నేతలు టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతోంది. కాబట్టి కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్ళకుండా తన పార్టీ ఎంఎల్ఏలను కాపాడుకోవటం కేసీయార్ కు పెద్ద తలనొప్పనే చెప్పాలి. ఐదుమంది కాంగ్రెస్ ఎంఎల్ఏలను లాగేస్తే వెంటనే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేయదు. అప్పుడు బీఆర్ఎస్ 39 మంది ఎంఎల్ఏలు, ఎంఐఎం 7, బీజేపీ 8=54 మంది ఎంఎల్ఏలవుతారు. అంటే ఇంకా ఆరుమంది ఎంఎల్ఏల అవసరముంది. అందుకనే లాగితే 4 గురు ఎంఎల్ఏలను కాదు ఏకంగా ఓ 15 మంది ఎంఎల్ఏకే కేసీయార్ గాలమేసే అవకాశముంది. అందుకనే ఇటు రేవంత్ అటు కేసీయార్  ఇద్దరూ ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారనేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: