ఆ విషయంలో టీడీపీతో జనసేన కలసి వస్తుందా?
అయిదు లక్షల మందితో ఈ భారీ బహిరంగ సభతోనే టీడీపీ ఎన్నికల యుద్ధాన్ని మొదలు పెట్టనుంది. ఈ సభల్లో ఫస్ట్ మొదటిసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కనిపిస్తారని అంతా భావించారు. ఆ విధంగా పార్టీ లో జోష్ పెంచాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. ఇప్పుడు దానికి బ్రేక్ పడబోతోంది. ఎందుకంటే యువగళం పాదయాత్ర ముగింపు సభకు తాను రాలేనని పవన్ కల్యాణ్ టీడీపీ నేతలకు చెప్పారంట. ఆ రోజున తనకు వేరే పనులు ఉన్నాయని షెడ్యూల్ ప్రకారం వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయని పవన్ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.
దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ టీడీపీ, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో ఇంకా పూర్తి కాలేదని.. ఆ మ్యానిఫెస్టో విడుదలకు పవన్ హాజరవుతారని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు భవిష్యత్తులో టీడీపీ నిర్వహించే మరిన్ని సభలకు వస్తారని వివరించారు. ఇప్పుడు అయితే యువగళం ముగింపు సభకు రాకపోవడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.
దీని వెనుక వేరే కారణాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. సీట్ల విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో జనసేన ఒకింత అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు నాన్చివేత ధోరణి పార్టీకి నష్టం చేకూరుస్తుందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పలు పార్టీల నుంచి జనసేనలోకి చేరికలు కొనసాగుతున్నాయి. కానీ వారికి పవన్ స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశం లేకుండా పోతోంది. అందువల్ల ముందు సీట్ల విషయం తేలితేనే పవన్ టీడీపీ సభలకు హాజరవుతారని తెలుస్తోంది.