అమరావతి : పాదయాత్ర గ్రాఫ్ రిపోర్టిదేనా ?
పాదయాత్ర చేసిన వాళ్ళకు తర్వాత తగిన ప్రతిఫలం ముట్టిందనే ప్రచారం ఎప్పటినుండో ఉంది. దానికి ఉదాహరణగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులవ్వటాన్ని చూపిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ను జైలులో పెట్టినపుడు చెల్లెలు వైఎస్ షర్మిల పాదయాత్ర చేశారు. అయితే పాదయాత్ర వల్ల వ్యక్తిగతంగా ఆమెకు జరిగిన మేలు ఏమిటో తెలీదు కానీ పార్టీ నిలదొక్కుకోవటానికి అవకాశం ఏర్పడింది. ఆ తర్వాత జగన్ జైలు నుండి రిలీజ్ అవ్వటం, ఎన్నికలు జరిగి ప్రధాన ప్రతిపక్షనేతగా ఐదేళ్ళుండటం అందరికీ తెలిసిందే.
ప్రతిపక్షంలో ఉన్నపుడే జగన్ పాదయాత్ర చేసి 2019 ఎన్నికలను ఎదుర్కొని అఖండ విజయం సాధించారు. దాంతో పాదయాత్ర చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులైపోతారనే ప్రచారం పెరిగిపోయింది. ఇపుడిదంతా ఎందుకంటే నారా లోకేష్ పాదయాత్ర ముగిసింది. 226 రోజులు, 97 నియోజకవర్గాల్లో 3132 కిలోమీటర్లు నడిచారు. టీడీపీకి పూర్వవైభం తీసుకురావటమే లక్ష్యంగా లోకేష్ పాదయాత్ర చేశారు. మరి ఆయన లక్ష్యం నెరవేరుతుందా ?
లక్ష్యం నెరవేరేసంగతి ఎలాగున్నా ముందు కొన్ని విషయాలు చెప్పుకోవాలి. అవేమిటంటే పాదయాత్రకు రెగ్యులర్ గా ఏదో రూపంలో అంతరాయం వస్తునే ఉంది. కుప్పంలో యువగళం మొదలైన రోజే మేనమామ రామకృష్ణ కొడుకు తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. తర్వాత బెంగుళూరు ఆసుపత్రిలో 20 రోజులుండి చనిపోయారు. లోకేష్ పాదయాత్ర జరగుతున్నపుడే చంద్రబాబు పర్యటనల్లో రెండుచోట్ల తొక్కిసలాట జరిగి 12 మంది చనిపోయారు. ఆ తర్వాత స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టవ్వటంతో పాదయాత్రను లోకేష్ నిలిపేశారు. రెగ్యులర్ బెయిల్ వచ్చిన తర్వాతే పాదయాత్ర పునఃప్రారంభమైంది.
ఇక పాదయాత్ర విషయం తీసుకుంటే టీడీపీకి రావాల్సినంత ఊపు రాలేదన్నది జనాల మాట. జగన్ పాదయాత్రలో మధ్యలో ఉండగానే టీడీపీ ఓటమి ఖాయమనే ప్రచారం పెరిగిపోయింది. జనాల్లో జగన్ పాదయాత్రపై పాజిటివ్ టాక్ బాగా ఉండేది. పాదయాత్ర ముగింపుకు వచ్చేసరికి వైసీపీ గెలుపు ఖాయమని అందరికీ అర్ధమైపోయింది. ఎందుకంటే పాదయాత్రలో జనాలు జగన్ కు ఇచ్చిన మద్దతే నిదర్శనం. అప్పట్లో పాదయాత్రను ఎల్లోమీడియా చాలా టోన్ డౌన్ చేసింది.
కానీ ఇపుడు లోకేష్ పాదయాత్రకు ఎల్లోమీడియా విపరీతంగా హైప్ క్రియేట్ చేసింది. పార్టీ కూడా ఎక్కడికక్కడ అన్నీ ఏర్పాట్లుచేసింది. ఇన్ని ఏర్పాట్లు జరిగినా లోకేష్ పాదయాత్రతో టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుందనే టాక్ పెద్దగా వినబడటంలేదు. పార్టీ జనాలు తప్ప మామూలు జనాలు పెద్దగా కనబడలేదు. అందుకనే పాదయాత్ర వల్ల టీడీపీ గ్రాఫ్ పెరిగిందా ? అంటే ఎవరు సమాధానం చెప్పలేకున్నారు.