అమరావతి : జోగయ్యకు అసలు విషయం అర్ధమైందా ?
అప్ప ఆరాటమే కాని బావ తిరిగొచ్చేది లేదు అనేది తెలుగులో బాగా పాపులర్ సామెత. ఆ సామెత పద్దతిలోనే పవన్ కల్యాణ్ సీఎం అవ్వాలని తన ఆరాటమే కానీ సీఎం అవ్వాలన్న ఆలోచన అసలు పవన్ కే లేదన్న విషయం మెల్లిగా జోగయ్యకు అర్ధమైనట్లుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలోచనలు మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్యకు ఇపుడు బోధపడినట్లుంది. అందుకనే ముఖ్యమంత్రి పదవి, లోకేష్ తాజా ప్రకటన లాంటి అంశాలపై పవన్ కు జోగయ్య బహిరంగలేఖ రాశారు.
అందులో పవన్ను జోగయ్య చాలా అంశాల్లో నిలదీశారు. ముఖ్యమంత్రయ్యే విషయంలో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న జనసైనికులకు ఏమి చెబుతావంటు పవన్ను సూటిగానే ప్రశ్నించారు. జోగయ్య గమనించాల్సిన విషయం ఏమిటంటే తనతో పాటు జనసేన నేతలు, క్యాడర్ పవన్ సీఎం అవుదామని అనుకుంటుంటే పవన్ మాత్రం చంద్రబాబునాయుడును సీఎం చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయం జోగయ్యకు బాగా లేటుగా అర్ధమైనట్లుంది.
పవన్ను ముఖ్యమంత్రిని చేయటానికి కాపులందరు సహకరించాలని జోగయ్య చాలాకాలంగా పదేపదే కాపు సామాజికవర్గాన్ని ప్రాదేయపడుతున్నారు. ఇపుడు కాకపోతే భవిష్యత్తులో కాపులకు రాజ్యాధికారం రాదని కాపు ప్రముఖులతో జోగయ్య ఒకపుడు సమావేశాలు కూడా పెట్టారు. తాజాగా ముఖ్యమంత్రి విషయంలో ఒక ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతు టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబే ముఖ్యమంత్రవుతారని చెప్పారు. ఇందులో ఎవరికీ అనుమానం అవసరంలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇదే విషయమై జోగయ్య ప్రస్తావిస్తు ‘చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని లోకేష్ చెప్పటంలో మీ అనుమతి కూడా ఉందా’ ? అని పవన్ను ప్రశ్నించారు.
బడుగు, బలహీన వర్గాలు యాచించే స్ధాయినుండి శాసించే స్ధాయికి రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కాకూడదన్నట్లుగా జోగయ్య అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటినుండి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండే కులాలు రాజ్యమేలుతున్న విషయాన్ని పవన్ కు జోగయ్య తన లేఖలో గుర్తుచేశారు. మొత్తంమీద తన బహిరంగలేఖలో పవన్ను చాలా విషయాల్లో నిలదీశారు. అంటే పవన్ ఆలోచనలతో జోగయ్య పూర్తిగా విభేదిస్తున్నట్లుగా అర్ధమవుతోంది.