అమరావతి : ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోందా ?

Vijaya


అధికారపార్టీ ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే ఈ వారంతంలో మూడోజాబితా విడుదలయ్యే అవకాశముందనే టాక్ పార్టీలో మొదలైంది. జాబితా అంటే ఎంఎల్ఏలు ఎందుకు టెన్సన్ పడుతున్నారు ? ఎందుకంటే  ఇప్పటికి విడుదలైన రెండు జాబితాల్లో 13 మంది ఎంఎల్ఏలకు జగన్మోహన్ రెడ్డి టికెట్లు నిరాకరించారు కాబట్టే. ఈ 13 మంది ఎంఎల్ఏల్లో మంత్రి గుడివాడ అమర్నాధ్ తో పాటు టీడీపీలో గెలిచి వైసీపీకి దగ్గరైన మద్దాలి గిరి కూడా ఉన్నారు.



మొదటి లిస్టులో సంతనూతలపాడు ఎంఎల్ఏ టీజేఆర్ సుధాకర్ బాబు, గుంటూరు వెస్ట్ మద్దాలి గిరి, మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నారు. రెండో జాబితాలో అనకాపల్లి ఎంఎల్ఏ గుడివాడ అమర్నాధ్, పాయకరావుపేట ఎంఎల్ఏ గొల్లబాబురావు, పీ గన్నవరం ఎంఎల్ఏ కొండేటి చిట్టిబాబు, జగ్గంపేట ఎంఎల్ఏ జ్యోతుల చంటిబాబు, ప్రత్తిపాడు ఎంఎల్ఏ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, కదిరి ఎంఎల్ఏ సిద్ధారెడ్డి, ఎమ్మిగనూరు ఎంఎల్ఏ ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, అరకు ఎంఎల్ఏ చెట్టి ఫల్గుణ, విజయవాడ సెంట్రల్ ఎంఎల్ఏ మల్లాది విష్ణు ఉన్నారు. అలాగే హిందుపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు కూడా జగన్ టికెట్ నిరాకరించారు.



వచ్చేఎన్నికల్లో గెలుపు ప్రాతిపదికగా జగన్ అనేక సర్వేలు చేయించుకుంటున్నారు. వాటి ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ఎంఎల్ఏలకు టికెట్లు నిరాకరిస్తు, కొందరిని నియోజకవర్గాలు మారుస్తున్నారు. ఈ నేపధ్యంలోనే మూడో జాబితాలో ఎవరి పేర్లుంటాయో అనే టెన్షన్ మిగిలిన ఎంఎల్ఏల్లో పెరిగిపోతోంది. ఇక్కడ సమస్య ఏమిటంటే జగన్ దగ్గర బెదిరింపులు, ఒత్తిళ్ళు పనిచేయవు. తన నిర్ణయాలు నచ్చని వాళ్ళు పార్టీని వదిలేసి వెళ్ళచ్చన్న పద్దతిలో జగన్ వ్యవహరిస్తుంటారు.



మంత్రి గుడివాడ అమర్నాధ్, ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి అత్యంత సన్నిహితులకే టికెట్లు ఇవ్వనని జగన్ చెప్పేయటం గమనార్హం. కొన్ని నియోజకవర్గాల్లో ఎంఎల్ఏల మద్దతుదారులు గొడవలు చేస్తున్నా జగన్ ఏమాత్రం పట్టించుకోవటంలేదు. టికెట్లు దక్కని ఎంఎల్ఏలు, నేతల మద్దతుదారులు గొడవలు చేయటం అన్నీ పార్టీల్లోను ఉండేవే. అదే సీన్ వైసీపీలో కూడా రిపీటవుతోంది. రేపు నోటిఫికేషన్ రిలీజ్ అయి నామినేషన్లు వేసిన తర్వాత పరిస్ధితులు అన్నీ సర్దుకుంటాయని జగన్ నమ్మకంగా ఉన్నట్లున్నారు. భవిష్యత్తులో  ఇంకెంతమంది ఎంఎల్ఏలకు టికెట్లు నిరాకరిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: