అమరావతి : ఎటాక్ షర్మిల...స్టార్టయ్యిందా ?
కాంగ్రెస్ కండువా కప్పుకున్న వైఎస్ షర్మిల మీద ఎటాక్ స్టార్టయ్యింది. జగన్మోహన్ రెడ్డితో పొసగని కారణంగా షర్మిల ఇంతకాలం తెలంగాణాలో వేరుకుంపటి పెట్టుకున్నారు. అయితే తెలంగాణా రాజకీయాల్లో ఆమె అట్టర్ ఫ్లాపయ్యారు. ఎంతకాలం ఉన్నా లాభంలేదని అర్ధమైపోయింది. అందుకనే తన పార్టీ వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేసి సడెన్ గా తన రాజకీయాన్ని ఏపీకి షిఫ్ట్ చేసేశారు. పార్టీలో ఆమె పాత్ర ఏమిటన్నది తొందరలోనే తెలుస్తుంది.
అయితే ఆమె అలా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారో లేదో వెంటనే వైసీపీ ముఖ్యుల నుండి షర్మిలపై ఎటాక్ మొదలైపోయింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతు షర్మిల కూడా తమకు ప్రత్యర్ధే అన్నారు. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే ప్రతి ఒక్కళ్ళు వైసీపీకి ప్రత్యర్ధులే అని స్పష్టంగా చెప్పారు. ఇక వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతు వైసీపీలో చోటులేని కారణంగానే షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. షర్మిల ఏపార్టీలో చేరినా తమకొచ్చే ఇబ్బంది ఏమీలేదని తేల్చేశారు.
మాజీమంత్రి కొడాలి నాని మాట్లాడుతు షర్మిల కాంగ్రెస్ లో చేరటం వల్ల వైసీపీకి వచ్చే నష్టమేమీలేదన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరటం వల్ల ఆ పార్టీకి ఒరిగేదేమీ ఉండన్నారు. షర్మిల వల్ల కాంగ్రెస్ కు ఓట్లు పడతాయని తాను అనుకోవటంలేదన్నారు. ఓట్లపరంగా ఏమన్నా నష్టం జరిగితే అది టీడీపీకే కానీ వైసీపీకి కాదని స్పష్టంచేశారు. రాష్ట్రాల్లో అడ్డుగోలుగా చీల్చిన కాంగ్రెస్ ను జనాలు ఎప్పటికి క్షమించరని తేల్చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరితే వైసీపీ ఓట్లు ఎలా చీలుతుందని ప్రశ్నించారు.
దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో చేరితే టీడీపీ ఓటుబ్యాంకు చీలిందా అని ఎదురు ప్రశ్నించారు. ఒక్కశాతం కూడా ఓటుబ్యాంకు లేని కాంగ్రెస్ వల్ల వైసీపీకి వచ్చే నష్టమేమీ ఉండదనే ధీమాను కొడాలి వ్యక్తంచేశారు. మొత్తానికి షర్మిల కాంగ్రెస్ లో చేరగానే సీనియర్లు ఎటాక్ మొదలుపెట్టారంటే జగన్ నుండి వచ్చిన ఆదేశాల ప్రకారమే జరిగుండాలి. లేకపోతే వీళ్ళెవరూ షర్మిలకు వ్యతిరేకంగా నోరిప్పే అవకాశంలేదు. కాబట్టి ముందు ముందు ఎటాక్ తీవ్రత మరింత పెరిగే సూచనలు కనబడుతున్నాయి. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.