అమరావతి : పొత్తుల చిచ్చు పెరిగిపోతోందా ?
రెండుపార్టీలు పొత్తు పెట్టుకుంటున్నపుడు రెండువైపులా అసంతృప్తులు ఉండటం చాలా సహజం. ఎందుకంటే పొత్తుల్లో రెండుపార్టీలూ తాము ఎప్పటినుండో పోటీచేస్తున్న నియోజకవర్గాలను మిత్రపక్షానికి త్యాగం చేయాల్సుంటుంది కాబట్టి. అయితే టీడీపీ-జనసేన పొత్తులో సమస్యంతా టీడీపీలోనే కనబడుతోంది. ఎందుకంటే త్యాగాలన్నీ సీనియర్ తమ్ముళ్ళే చేయాల్సొస్తోంది కాబట్టే. దశాబ్దాలుగా తమ్ముళ్ళు పోటీచేస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీచేయబోతోంది. అందుకనే తమ్ముళ్ళల్లో టెన్షన్, అసంతృప్తి పెరిగిపోతోంది. అందుకనే ఆయా నియోజకవర్గాల్లో తమ్ముళ్ళు తమ మద్దతుదారులతో సమావేశమవుతున్నారు.
ఇక్కడ సమస్య ఏమిటంటే పొత్తులో రెండుపార్టీలు ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తాయి ? పోటీచేయబోయే నియోజకవర్గాలేవి అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే అనధికారికంగా జనసేన నేతలు మాత్రం కొన్ని చోట్ల ప్రచారం చేసేసుకుంటున్నారు. దాంతో ఆ నియోజకవర్గాల్లో జనసేన నేతలకు, తమ్ముళ్ళకు మధ్య గొడవలవుతున్నాయి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జనసేన నేత కందులదుర్గేష్ ప్రచారం చేసేసుకుంటున్నారు. ఇక్కడ టీడీపీ ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్యచౌదరి మండిపోతున్నారు. తెనాలిలో సీనియర్ తమ్ముడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీకి రెడీ అయ్యారు. అయితే జనసేన తరపున తాను పోటీచేయబోతున్నట్లు నాదెండ్ల మనోహర్ ప్రచారం మొదలుపెట్టేశారు.
పెందుర్తిలో సీనియర్ తమ్ముడు బండారు సత్యనారాయణమూర్తి తానే పోటీచేస్తానని చెబుతున్నారు. అయితే ఇక్కడినుండి పంచకర్ల రమేష్ అభ్యర్ధిగా ప్రచారం చేసేసుకుంటున్నారు. భీమిలీ, పాయకరావుపేట, పిఠాపురం, తిరుపతి, విజయవాడ వెస్ట్ లాంటి అనేక నియోజకవర్గాల్లో రెండుపార్టీల్లోని నేతలమధ్య గొడవలవుతున్నాయి. తమ్ముళ్ళ వాదన ఏమిటంటే నియోజకవర్గాలను అధికారికంగా ప్రకటించకముందే జనసేన తరపున అభ్యర్ధులుగా ఎలా ప్రచారం చేసుకుంటారని.
దీనికి జనసేన నేతల సమాధానం ఏమిటంటే నియోజకవర్గాల్లో తమను ఏర్పాట్లు చేసుకోమని అధినేత పవన్ కల్యాణ్ నుండి ఆదేశాలు వచ్చాయని. దీనిపైనే తమ్ముళ్ళు మండిపోతున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు, లోకేష్ దగ్గరే తేల్చుకోవాలని తమ్ముళ్ళు ప్రయత్నిస్తున్నారు. చూడబోతే ఈ సమస్య ముందుముందు మరింత పెద్దదిగా మారే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రెండుపార్టీల మధ్య పొత్తుల చిచ్చు తప్పదా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చివరకు ఏమవుతుందో చూడాలి.