అమరావతి : ఎల్లోమీడియా భలే కథల్లేసిందే

Vijaya

జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన దాదాపు ఖరారైందట. బుధవారం ఆయన ఢిల్లీ వెళుతున్నారట. కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం సోమవారం నుండి ఎదురుచూస్తున్నారట. బుధవారం అపాయిట్మెంట్ ఫైనల్ అయ్యే అవకాశముందని ఎల్లోమీడియా రాసింది. విచిత్రం ఏమిటంటే ఢిల్లీ పర్యటన ఖరారైందని రాసింది ఎల్లోమీడియానే. అమిత్ షా అపాయిట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నట్లు రాసిందీ ఎల్లోమీడియానే. అపాయిట్మెంట్ ఖరారైతే మళ్ళీ ఎదురుచూడటం ఏంటో అర్ధంకావటంలేదు. బుర్రకుతోచిన అడ్డదిడ్డమైన వార్తలు రాయటం ఎల్లోమీడియాకు అలవాటైపోయింది.





దీనికన్నా కామెడి కథనం మరోటి వండివార్చేసింది. ఇంతకీ జగన్ ఢిల్లీలో అమిత్ షా ను ఎందుకు కలవాలని అనుకుంటున్నట్లు ? ఎందుకంటే భర్తీ కావాల్సిన మూడు  రాజ్యసభ స్ధానాల్లో ఒకదాన్ని బీజేపీకి ఇస్తానని ఆఫర్ చేయటానికట. ఎందుకంటే తనను కష్టాల్లో నుండి బయటపడేయమని బతిమలాడుకోవటానికట. జగన్ కు వచ్చిన కష్టాలు ఏమిటంటే పీసీసీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి చెల్లెలు షర్మిల తనను వాయించేస్తోందట. షర్మిల ధాటిని జగన్ తట్టుకోలేకపోతున్నారట.





అంతకుముందే టీడీపీ-జనసేన జోరు బాగా పెరిగిపోయిందట. టికెట్లు దక్కని వైసీపీ ఎంఎల్ఏలు చేస్తున్న తిరుగుబాటుతో బాగా ఇబ్బంది పడుతున్నారట. టీడీపీ-జనసేన జోరును తట్టుకోవటం, షర్మిల దూకుడును అడ్డుకోవటం జగన్ వల్ల కావటంలేదట. అందుకని తమ పార్టీకి దక్కబోయే మూడు స్ధానాల్లో ఒకటి బీజేపీకి ఇస్తానని, అందుకు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు సహకరించమని అమిత్ షా ను రిక్వెస్టు చేయటానికి ఢిల్లీ వెళుతున్నారట.





ఎల్లోమీడియా ఓ పిచ్చి కథనం అల్లేసిందన్న విషయం అర్ధమవుతోంది. ఎలాగంటే టీడీపీ-జనసేన జోరు ఎల్లోమీడియాలో మాత్రమే పెరిగిపోతోంది. వాస్తవంగా పొత్తులు, నియోజకవర్గాలు తేలకుండా రెండుపార్టీల నేతల గోలతో చంద్రబాబునాయుడుకే బుర్రతిరిగిపోతోంది.అసలు పొత్తుంటుంటుందా లేకపోతే చిత్తవుతుందా అన్న టెన్షన్ చంద్రబాబులో పెరిగిపోతోంది. వాస్తవం ఇదైతే రెండుపార్టీల పొత్తు జోరుతో జగన్లో టెన్షన్ పెరిగిపోతోందని రాయటమే పెద్ద కామెడి.





ఇక షర్మిల దూకుడు ఏముందో అర్ధంకావటంలేదు. చాలా కాలంగా అన్నమీద కోపంతో షర్మిల నోటికొచ్చింది మాట్లాడుతునే ఉన్నారు ఇందులో కొత్తేముంది ? అప్పుడు విశ్వసనీయవర్గాల పేరుతో ఎల్లోమీడియాలో కనబడిన కథనాలే ఇపుడు పీసీసీ అధ్యక్షురాలిగా మాట్లాడుతున్నారంతే. పొత్తుతో జగన్ బేజారైపోయారు, చెల్లెలు దూకుడుకు వణికిపోతున్నారని ఎల్లోమీడియా కథనం భలే అల్లేసింది. ఇంతకుముందు కూడా నరేంద్రమోడి-జగన్, అమిత్ షా-జగన్ మధ్య జరిగిన భేటీపైన కూడా విశ్వసనీయవర్గాలంటు ఎన్నో కథలల్లేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: