ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం హీటెక్కింది. ఓవైపు ఎన్నికలు దగ్గరపడుతుంటే.. మరోవైపు పొత్తుల అంశం నేతల్లో కంగారు పెడుతుంది. బీజీపీతో.. టీడీపీ పొత్తు అనగానే ఆపార్టీ నేతల్లో కలవరం మొదలైంది. ఐదు సంవత్సరాలు కష్టపడి సమీకరించుకున్న ముస్లిం ఓట్లు.. దూరమవుతాయోనన్న భయం సీమ టీడీపీలో మొదలైంది. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో మైనారిటీలు దాదాపు నాలుగు నియోజకవర్గాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అయితే అందులో మొదటిగా కడప అసెంబ్లీ నియోజకవర్గం. అయితే ఇక్కడ దాదాపు 50 శాతం ఓట్లు మైనారిటీలవే.బీజేపీ, టీడీపీ ఇంకా జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే కడప నియోజకవర్గంలోని 95 వేలమంది ముస్లిం మైనారిటీల ఓట్లు వన్ సైడ్ ఓటింగ్ చేయడం పక్కా అనే అభిప్రాయం స్థానికుల నుంచి వస్తుంది. ఇక రాయచోటి నియోజకవర్గంలో మైనారిటీలు ప్రధాన పాత్ర పోషిస్తారు. అక్కడ దాదాపు 70 వేలమంది ముస్లిం మైనార్టీ ఓటర్లు ఉన్నారు. వీళ్ళు కూడా అలయన్స్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే సమాచారం వినిపిస్తుంది.
ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా దాదాపు 60 వేల ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఇక ఆ మూడు పార్టీల మధ్య పొత్తులు కుదిరితే వన్ సైడ్‌గా ఓట్ వేయనున్నారు. కమలాపురంలో అయితే ముస్లిం మైనారిటీలు దాదాపు 40 వేల ఓట్లు ఉన్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారనే సమాచారం వినిపిస్తుంది.బీజేపీతో తెలుగుదేశం పొత్తును ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ నేతలు ఎవరు అంగీకరించడం లేదు. బీజేపీతో పొత్తును వారు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పోటీ చేయలేమని పార్టీ పెద్దలకు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు, ఆదోని, నంద్యాల, బనగానపల్లె, శ్రీశైలం, నందికొట్కూరు ఇంకా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంటు స్థానాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనేది టిడిపి నేతల భయం. అలాగే అనంతపురం జిల్లాలో కూడా బీజేపీతో పొత్తును టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం, మైనార్టీలు పార్టీకి దూరమవుతారంటూ ఆవేదన చెందుతున్నారు.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళలో ఇలాంటి కొత్త చిక్కులేంటని చర్చించుకుంటున్నారు.