హైదరాబాద్ : తెలంగాణా కాంగ్రెస్ కు అధిష్టానం షాకిచ్చిందా ?
పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఇంతకీ తెలంగాణా కాంగ్రెస్ కు అధిష్టానం ఏ విషయంలో షాక్ ఇచ్చింది. ఎందులో అంటే రాజ్యసభ ఎన్నికల్లో. ఎలాగంటే ఏప్రిల్ 2వ తేదీన తెలంగాణాకు చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు రిటైర్ అవుతున్నారు. వాళ్ళని ఎంపికచేయటానికి ఈనెల 27వ తేదీన కేంద్ర ఎన్నికల కమీషన్ ఎన్నిక నిర్వహించబోతోంది. దీనికి 15వ తేదీన నామినేషన్ ఆఖరుతేది.
అసెంబ్లీలో ఉన్న ఎంఎల్ఏల సంఖ్య 119 ప్రకారం ప్రతి రాజ్యసభ ఎంపీకి 30 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాల్సుంటుంది. దీని ప్రకారం కాంగ్రెస్ కు ఉన్న 64 మంది సభ్యులను లెక్క తీసుకుంటే రెండు సీట్లు రావటం ఖాయం. అలాగే బీఆర్ఎస్ కున్న 39 ఎంఎల్ఏల ప్రకారం ఒక్క సీటు రావటం ఖాయం. కాంగ్రెస్ కు దక్కబోయే రెండు సీట్ల కోసం నేతల మధ్య విపరీతమైన పోటీ పెరిగిపోతోంది. 15వ తేదీన నామినేషన్ కు ఆఖరు అయినా ఇంతవరకు అధిష్టానం అభ్యర్ధులను ఫైనల్ చేయలేదు.
ఈ నేపధ్యంలోనే సడెన్ గా ఒక ప్రచారం మొదలైంది. అదేమిటంటే కాంగ్రెస్ కు దక్కిన రెండు సీట్లలో ఒకటి తన కోటాగా ఏఐసీసీ తీసుకున్నదట. ఏఐసీసీ కోటా అంటేనే ఇతర రాష్ట్రాల వాళ్ళకి అవకాశం ఇస్తుందని అర్ధమైపోతోంది. తెలంగాణా నుండి వీహెచ్, రేణుకాచౌదరి, జానారెడ్డి, చిన్నారెడ్డి, మధుయాష్కి గౌడ్ లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
అయితే ఏఐసీసీ తరసున అజయ్ మాకెన్ కు ఒక స్ధానం రిజర్వ్ అయినట్లు పార్టీవర్గాల సమాచారం. బహుశా మంగళవారం సాయంత్రం లేదా బుధవారం తెల్లవారే దీనిపై అధికార ప్రకటన ఉంటుందని అనుకుంటున్నారు. అయితే రెండు సీట్లు తెలంగాణా వాళ్ళకే కేటాయించాలని ఇక్కడి నేతలు అడుగుతున్నారట. ఏదేమైనా ఏఐసీసీకి ఒక సీటు రిజర్వ్ అయితే మిగిలిన సీటు కోసం పోటీ విపరీతంగా పెరిగిపోవటం ఖాయం. మరి అంతపోటీలో ఆ ఒక్కస్ధానాన్ని దక్కించుకునేది ఎవరు అనే ఆసక్తి పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.