అమరావతి : ఇద్దరికీ షాక్ తప్పదా ?
రాబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడుకు షాక్ తప్పేట్లు లేదు. అదికూడా వైఎస్ షర్మిల రూపంలోనే కావటం గమానార్హం. ప్రస్తుతం షర్మిల ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎగిరెగిరి పడుతున్నారు. జగన్ పైన బురదచల్లేయటమే టార్గెట్ గా షర్మిల రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తాము జగన్ పైన ఎన్ని ఆరోపణలు చేసినా, ఎల్లోమీడియాలో ఎన్ని వార్తలు, కథనాలు రాయించినా జనాలు నమ్మటంలేదని అర్ధమైనట్లుంది.
అందుకనే సొంత చెల్లెల్ను తెలంగాణా నుండి ఏపికి పిలిపించుకుని కాంగ్రెస్ చీఫ్ గా నియమించేట్లు చంద్రబాబే చక్రంతిప్పారనే ప్రచారం అందరికీ తెలిసిందే. జగన్ పైన ఆరోపణలు, విమర్శలతో బురదచల్లేందుకు షర్మిలను తెలంగాణా నుండి ఏపికి పిలిపించారనే విషయం జనాలకు కూడా అర్ధమైంది. ఎన్నికల ముందు కాబట్టి షర్మిల ఆరోపణలు, విమర్శలకు ఎల్లోమీడియా కూడా బాగా ప్రచారం కల్పిస్తోంది. అయితే ఇదే షర్మిల ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కు షాకివ్వబోతున్నట్లు సంకేతాలు కనబడుతున్నాయి.
షాక్ ఎలాగంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చటం ద్వారా. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలినిచ్చేదిలేదని ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తానని ఒకపుడు పవన్ పదేపదే చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిస్తే బీజేపీ ఒక కూటమిగా పనిచేస్తాయి. కాంగ్రెస్, వామపక్షాలు మరో కూటమిగా ఉంటాయి. వైసీపీ ఒంటరిగా పోటీచేస్తుంది. అంటే పవన్ చెప్పినట్లుగా రాబోయే ఎన్నికల్లో ఫేస్ టు ఫేస్ కాకుండా త్రికోణపోటీ జరగబోతోందని అర్ధమవుతోంది.
మరి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనన్న పవన్ శపథం ఏమైనట్లు ? వీగిపోయినట్లే కదా. నిజంగానే పవన్, చంద్రబాబు, ఎల్లోమీడియా పదేపదే చెబుతున్నట్లుగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లుంటే అవన్నీ టీడీపీ కూటమికే పడుతుందని గ్యారెంటీ లేదుకదా. ఎన్నొకొన్ని కాంగ్రెసో, వామపక్షాల కూటమికి కూడా పడే అవకాశముంది కదా. కాకపోతే కాంగ్రెస్ కూటమికి ఎన్ని ఓట్లు పడతాయనే దానిపైన టీడీపీ కూటమికి తగ్గిపోయే ఓట్లసంఖ్య ఆధారపడుంది. ఏదేమైనా ఆ మేరకు వైసీపీకి లాభమనే అధికారపార్టీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. కాబట్టి పోలింగ్ సమయంలో షర్మిల టీడీపీ కూటమికి షాక్ ఇవ్వటం ఖాయమనే అనుకుంటున్నారు.