గోదావరి : ఎటూ కాకుండా అయిపోయారా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధాన మద్దతుదారుడు కందుల దుర్గేష్ ని చూస్తే అయ్యో పాపం అనిపిస్తోంది. ఎందుకంటే కందులకు రాబోయే ఎన్నికల్లో పోటీచేయటానికి నియోజకవర్గం అన్నది లేకుండా పోయింది. విషయం ఏమిటంటే మూడురోజులు క్రితం చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఇద్దరు 99 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో సంబంధంలేకుండా అంతకుముందే రాజమండ్రి పర్యటనలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కందుల దుర్గేష్ పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు.
పవన్ ప్రకటనతో దుర్గేష్ తో పాటు ఆయన మద్దతుదారులు నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరంచేశారు. అయితే 99 మంది అభ్యర్ధులను ప్రకటించిన జాబితాలో దుర్గేష్ పేరులేదు. ఎందుకంటే ఒకవైపు కందులల మరోవైపు టీడీపీ ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎవరికివారుగా తామే పోటీచేయబోతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. కందులకు టికెట్ ప్రకటించిన పవన్ తో బుచ్చయ్య విభేదించారు. పవన్ ఏ ప్రకటనచేసినా పోటీచేయబోయేది మాత్రం తానే అని గట్టిగా చెప్పారు. దాని ప్రభావమో ఏమో ప్రకటించిన జాబితాలో కందుల పేరులేదు.
దాంతో కందులతో పాటు పార్టీలో పెద్ద కలకలం మొదలైంది. దానిపై రెండుపార్టీల్లోను తర్జనబర్జనలు జరుగుతున్నాయి. సడెన్ గా సోమవారం మధ్యాహ్నం కందులను రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కూడా నిడదవోలు నియోజకవర్గంలో పోటీచేయాలని చెప్పినట్లుగా ప్రచారం మొదలైంది. దాంతో టీడీపీ సీనియర్ నేతలు, క్యాడరంతా అప్రమత్తమైపోయింది. కందుల నిడదవోలుకు నాన్ లోకల్ కాబట్టి ఇక్కడ పోటీచేసేందుకు ఒప్పుకోమంటు మాజీ ఎంఎల్ఏ బూరుగపల్లి శేషారావుకు మద్దతుగా నిలబడ్డారు. ఇపుడు కందుల పని ఎలాగైందంటే రాజమండ్రి రూరల్ లో పోటీచేయటానికి లేకుండాపోయింది, నిడదవోలులో టీడీపీ నేతలు ఒప్పుకోవటంలేదు.
ఇపుడు ఏమిచేయాలో కందులకు అర్ధంకావటంలేదు. అంటే ఎక్కడికక్కడ జనసేన నేతలను టీడీపీ నేతలు అడ్డుకుంటున్న విషయం అర్ధమవుతోంది. జనసేనకు దక్కిన 24 సీట్లలో పవన్ ప్రకటించిందే ఐదుగురు అభ్యర్ధులను. రాజమండ్రి మిగిలిన 19 నియోజకవర్గాల్లో ఉందని అనుకున్నారు. అయితే తాజా పరిణామాలను గమనిస్తే అసలు జనసేన కోటాలో రాజమండ్రి రూరల్ లేదని అర్ధమైపోయింది. మరి జనసేన పోటీచేయబోయే నియోజకవర్గాల జాబితాలో రాజమండ్రి లేకుండానే కందుల పోటీచేస్తారని పవన్ ఎలాగ ప్రకటించారో అర్ధంకావటంలేదు. మొత్తంమీద జనసేన పోటీచేయబోయే నియోజకవర్గాలపై జనాలందరిలోను అయోమయం పెరిగిపోతోందన్నది వాస్తవం.