అమరావతి : చంద్రబాబు ప్లాన్ వర్కవుటవుతుందా ?
ఎన్నికలు దగ్గరకు వస్తున్నకొద్ది జగన్మోహన్ రెడ్డిపైన ఆరోపణల్లో చంద్రబాబునాయుడు స్పీడు పెంచుతున్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో ఆరోపణలుచేయటం సాధ్యంకావటంలేదు. అందుకనే సడెన్ గా వివేకానందరెడ్డి హత్యకేసు మీద దృష్టిపెట్టారు. గడచిన నాలుగురోజులుగా ఇదేవిషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఎల్లోమీడియాతో వివేకాహత్యపై రకరకాల వార్తలు, కథనాలు రాయిస్తున్నారు. తాను ఆరోపణలు చేసినా, ఎల్లోమీడియాలో కథనాలు రాయించినా పెద్దగా ఉపయోగం ఉండదని అర్ధమైనట్లుంది. అందుకనే వివేకా కూతురు సునీతతో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
ప్రెస్ మీట్లో సునీత చేసిన ఆరోపణలను పట్టుకుని నాలుగురోజులుగా నానా గోలచేస్తున్నారు. అయితే చంద్రబాబు, ఎల్లోమీడియా మరచిపోయిన విషయం ఒకటుంది. అదేమిటంటే వివేకానందరెడ్డికి ప్రత్యేకంగా అస్తిత్వం అంటు ఏమీలేదు. వివేకా గురించి కడప జిల్లాలో తెలిసినట్లుగా మిగిలిన జిల్లాల్లో తెలీదు. వివేకా రాష్ట్రస్ధాయి నేతకూడా కాదు. కనీసం కడప జిల్లా మొత్తాన్ని ఒంటిచేత్తో శాసించేంత సత్తా ఉన్న నేత కూడా కాదు. తాను ఎక్కడ తిరిగినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తమ్మడిగానో లేకపోతే జగన్ బాబాయ్ గానే చెలామణయ్యేవారు.
ఇంతోటి వివేకా హత్యను రాష్ట్రస్ధాయి సమస్యగా చిత్రీకరించాలని చంద్రబాబు, ఎల్లోమీడియా పడుతున్న తాపత్రయం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. వివేకా హత్యకు జగన్ కు ముడిపెట్టి జగనే హత్యచేయించాడనే కలరింగును ఇస్తున్నారు. ఈ విషయాన్ని సునీతతో మీడియాలో చెప్పించారు. దాన్నిపట్టుకుని వివేకా హత్యలో జగన్ పాత్రకూడా ఉందని ఇపుడు నానా రచ్చచేస్తున్నారు. సునీత చేస్తున్న వాదన పరస్పర విరుద్ధంగా ఉందన్న విషయాన్ని జనాలెప్పుడో గ్రహించారు. హత్యజరిగిన వెంటనే చంద్రబాబు అండ్ కో పనే అని ఆరోపించారు. రోజులు గడిచేకొద్ది దగ్గరవాళ్ళే అన్నారు.
తర్వాత కుటుంబసభ్యుల పాత్రుందన్నారు. మెల్లిగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డికి నిందితులతో సంబంధాలున్నాయన్నారు. ఆరోపణలే కాని ఆధారాలను చూపలేకపోవటంతో సీబీఐ కూడా ఏమీచేయలేకపోయింది. చివరకు జగన్ పాత్రపైనా సీబీఐ దర్యాప్తుచేయాలనే డిమాండు మొదలుపెట్టారు. చంద్రబాబు ఎక్కడ బహిరంగసభలో మాట్లాడినా వివేకా హత్యకేసుకు చాలా ప్రాధాన్యతిస్తున్నారు. అంటే రాబోయే ఎన్నికల్లో వివేకా హత్యకేసునే జగన్ కు వ్యతిరేకంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. మరి చంద్రబాబు ప్లాన్ ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాల్సిందే.