విశాఖ: గ్లాసులో తుఫాన్... కంచుకోటలో జనసేన మునిగే నావేనా..!
భీమిలి సీటును జనసేన నేతలు ఆశించారు. దానిని పొత్తులో టీడీపీకి ఇవ్వడంతో చంద్రబాబు ఆ సీటు గంటాకు కోట్లాది రూపాయలకు అమ్ముకున్నాడని జనసేన నేతలు వాపోతున్నారు. భీమిలి సీటు పంచకర్ల సందీప్‌కు ఇస్తానని పవన్ మాట ఇచ్చి.. చివర్లో మాట తప్పడంతో ఆయన ఆగ్రహంతో ఉన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో టిక్కెట్టు ఇస్తామన్న హామీతో గ్లాసు పట్టుకున్న కార్పొరేటర్లు.. కందుల నాగరాజు, సాధిక్.. పవన్ ను నమ్ముకుని రోడ్డున పడ్డామని వాపోతున్నారు.
ఉత్తర నియోజకవర్గం లో పార్టీ కోసం ఎప్పటినుంచో కష్టపడుతున్న పసుపులేటి ఉషాకిరణ్‌కి పవన్ హ్యాండ్ ఇచ్చేశారు. గాజువాక టిక్కెట్ ఆశించి కోట్లు ఖర్చుపెట్టిన సుందరపు సతీష్ ని కూడా కరివేపాల పక్కన పడేశారు. అనకాపల్లిలో పరుచూరి భాస్కరరావు గత ఎన్నికలలో పోటీచేసి పార్టీ కోసం కష్టపడుతూ వస్తుంటే ఆయనను కాదని అలా కండువా కప్పుకున్నారో లేదో వెంటనే కొణతాల రామకృష్ణకు సీటు ఇచ్చేశారు. పాయకరావుపేటలో జనసేన నేత గడ్డం బుజ్జి సీటు ఆశిస్తే ఇవ్వలేదు.
చివరకు వంగలపూడి అనితకు సీటు ఇవ్వొద్దని రిక్వెస్ట్ చేసినా పవన్ పట్టించుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖపట్నం జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలలోను జనసేనలో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ జనసేన సొంతంగా పోటీ చేసినా గట్టి ప్రభావం చూపేది. పొత్తులో భాగంగా కనీసం పవన్ ఏడు, ఎనిమిది సీట్లు అడుగుతారని అనుకుంటే.. నాలుగు సీట్లు తీసుకున్నారు. అనకాపల్లి పార్లమెంటు సీటు తీసుకుని మరి బీజేపికి కట్టబెట్టారు. దీంతో జిల్లాలో జనసేన కేడర్ పవన్ తీరుపై రగిలిపోతుంది.