రాయలసీమ: మళ్లీ మొదలైన రాజకీయ వేడి.. డోన్ ఎవరి కైవసం..!!

Divya
ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గంగా డోన్ మారింది.. జిల్లా విభజన తర్వాత డోన్ కాస్తా నంద్యాల జిల్లాలోకి చేరిపోయింది.. 1951లో కొత్తగా అసెంబ్లీ ఏర్పడగా.. 1952లో మొదటిసారి అక్కడ ఎన్నికలు జరిగాయి.. ఆ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా కోట్రిక వెంకటశెట్టి ఎమ్మెల్యేగా గెలిచారు.. మళ్లీ 1955లో ఎన్నికలు జరగగా.. బేతంచర్లకు చెందిన బుగ్గన శేషారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు.. ఈయన ముద్ర ఇప్పటికీ ఆ నియోజకవర్గంలో చెరిగిపోలేదట.. ఎందుకంటే బేతంచర్ల లో ఈయన ఉచితంగా హాస్పిటల్స్, స్కూల్స్.. తన సొంత డబ్బులతోనే నిర్మించారు. ఈ నిర్మాణం ఇప్పటికీ చెక్కుచెదరలేదట. బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఈయనను రావ్ బహదూర్ అనే బిరుదుతో శేషారెడ్డిని సత్కరించారు. ఆయన మనవడే ఇప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి..
1962లో మాజీ రాష్ట్రపతి నీలంసంజీవరెడ్డి కూడా డోన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయాన్ని అందుకున్నారు.. 1978లో కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి డోన్ కు మంచి బంధం ఏర్పడింది.. 1978 నుంచి 2019 వరకు కేఈ కుటుంబీకులే పోటీ చేస్తున్నారు.. అక్కడ 5సార్లు.. కేఈ కృష్ణమూర్తి.. రెండుసార్లు ప్రభాకర్ రెడ్డి.. రెండుసార్లు ప్రతాప్  డోన్ నుంచి పోటీ చేశారు.. కోట్ల కుటుంబం నుంచి కూడా రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రానికి పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి , ఆయన కోడలు కోట్ల సుజాత.. ఆయన తమ్ముడు కోట్ల హరి చక్రపాణి కూడా పోటీ చేశారు.

ఈసారి కోట్ల తనయుడు కేంద్ర మాజీ మంత్రి సూర్య ప్రకాశ్ రెడ్డి పోటీ చేయబోతున్నారు.. అయితే ఇంతమంది మంత్రులను, ఉపముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను, ముఖ్యమంత్రులను అందించిన డోన్ లో మాత్రం అభివృద్ధి జరగలేదు.. అందుకే అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గంగా విమర్శలను మూటకట్టుకుంది. ఈ తరుణంలోనే వైసీపీ పార్టీ ఆవిర్భావంలో బుగ్గన ప్రవేశంతో  ఒక్కసారిగా డోన్ తలరాత మారిపోయింది.. 2014 ఎన్నికలలో ఆంధ్రాలో మొట్టమొదటి అసెంబ్లీ అభ్యర్థి డోన్ నుంచి బుగ్గన రాజేంద్రప్రసాద్ రెడ్డిని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి  ప్రకటించారు.. దీంతో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన కేఈ కుటుంబాలను ఢీ కొట్టినట్లు జగన్ సభలో కూడా ప్రకటించారు..

అంతేకాదు డోన్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ అసెంబ్లీగా తీర్చిదిద్దుతామంటూ తెలిపారు.. అలా 2014..2019లో బుగ్గన తిరుగులేని మెజారిటీతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆర్థిక మంత్రిగా ఐదేళ్లపాటు ఉన్న బుగ్గన రెండేళ్లు కరోనా కారణం చేత ఇబ్బంది పడినప్పటికీ మిగిలిన సమయాన్ని ఎంతో ప్రతిభా వంతంగా తీర్చిదిద్దారని అక్కడి నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా బేతంచర్ల , ప్యాపిలి , డోన్ వంటి ప్రాంతాలలో మంచి ప్రగతిని సాధించారు..

ఈ సమయంలో టిడిపి ఇన్చార్జిగా ఉండడానికి అటు కోట్ల ఇటు కేఈ కుటుంబాల నుంచి ఎవరు ముందుకు రాలేదు.. ఆ సమయంలో సుబ్బారెడ్డిని చంద్రబాబు ఇన్చార్జిగా ప్రకటించగా.. అక్కడ వ్యతిరేకం రావడంతో మళ్లీ సూర్య ప్రకాశ్ రెడ్డి ని రంగంలోకి దింపారు చంద్రబాబు.. బుగ్గనను ఢీ కొట్టాలి అంటే.. కోట్ల ,కేఈ కుటుంబాలతో పాటు సుబ్బారెడ్డి వంటి వారు ఉండాలని అందరిని ఏకం చేశారు. దీంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా సై అంటూ ముందుకు వెళ్తున్నారు.. వైసిపి పార్టీ రాకతో కాంగ్రెస్ కనుమరుగవ్వడంతో ఆ పార్టీలో ఉండే కోట్ల వర్గం మొత్తం బుగ్గన రాజేంద్రప్రసాద్ వైపు మళ్ళింది.. మళ్లీ ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత తిరిగి కోట్ల కుటుంబం డోన్ చేరికతో సరికొత్త రాజకీయానికి తెర లేపుతోంది. దీంతో కేఈ వర్గం, టిడిపి క్యాడర్ మొత్తం కూడా కోట్ల కుటుంబం పైన ఆధారపడింది.
ఎలక్షన్స్ కి మరో 40 రోజులు ఉన్న సమయంలోనే డోన్ లో అసెంబ్లీ ఎన్నికలు కురుక్షేత్ర స్థాయిని తలపిస్తున్నాయి.. ఎండని లెక్కచేయకుండా ప్రతి గడపను కూడా చుట్టేస్తున్నారు నేతలు. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే పార్టీల మధ్య కాకుండా రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న పోరు అన్నట్లుగా తెలుస్తోంది. వ్యవసాయంతో పాటు మైనింగ్ లో కూడా అక్కడ వారికి పెద్ద ఉపాధి ఉన్నది.. ముఖ్యంగా ముస్లింలు, రెడ్డి, కాపులు ఇతరత్రా కులాల వర్గాలు కూడా అక్కడ ప్రధాన ఓటు బ్యాంకు. గత ఎన్నికలలో బుగ్గన 35 వేల మెజారిటీతో గెలిచారు. దీంతో ఈసారి అభివృద్ధి జరగడంతో మరింత ఎక్కువ మెజారిటీ సాధించాలని భావిస్తున్నారు.. టిడిపి మాత్రం వైసీపీలో వ్యతిరేకత ఉందని తమ పార్టీదే విజయమంటూ  తెలుపుతున్నారు.. రానున్న రోజుల్లో ఎవరి ప్రజాబలం ఏంటి అనేది ఉత్కంఠంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: