ఏపీ ఎన్నికల్లో ఆటో - ట్రక్ - రోడ్ రోలర్ గుర్తులకు ఇక బైబై.. !
ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నిజం. జనసేనకు గాజు గ్లాసు గుర్తు ఉంది. కానీ, ఇది శాశ్వత గుర్తు కాదు. ఎందుకంటే జనసేన శాశ్వత గుర్తింపు ఉన్న పార్టీ కాకపోవడమే కారణం. ఇది కనీసం 15 శాతం సీట్లు, 15 శాతం ఓట్లు దక్కించుకోలేదు. దీంతో ఈ పార్టీని ఎన్నికల సంఘం రిజిస్టర్డ్ పార్టీగానే చూస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు గుర్తుల విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి. ఇలానే తాజాగా గాజు గ్లాసు గుర్తు విషయంలో వేరే పార్టీ క్లెయిమ్ చేసింది. దీంతో జనసేన న్యాయ పోరాటానికి దిగింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. ఇక్కడ కీలక విషయం ఏంటంటే.. పార్టీలకైనా.. అభ్యర్థులకైనా.. గుర్తు అత్యంత ప్రధానం.
వైసీపీ, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఆర్ ఎస్, ఆప్ ఇలా అనేక పార్టీలకు శాశ్వత గుర్తింపు ఉండడంతోవాటికి శాశ్వత ఎన్నికల గుర్తు ఉంది. కానీ, ఇండిపెండెంట్లుగా అప్పటికప్పుడు రంగంలోకి దిగే వారికి మాత్రం శాశ్వత గుర్తింపు ఉండదు. ఇక, రిజిస్టర్డ్ పార్టీల పరిస్థితి కూడా ఇలానే ఉంది. దీంతో ఆయా పార్టీలకు అప్పటికప్పుడు ఎన్నికల సంఘం కొన్ని గుర్తులు కేటాయి స్తుంది. ఉదాహరణకు కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీకి విజిల్ గుర్తును కేటాయించారు. అయితే.. ఇప్పుడు ఇది ఉంటుందో ఉండదో తెలియదు. ఇలా.. అప్పటికప్పుడు ఎన్నికల సంఘం గుర్తులు ఇస్తుంటుంది.
అయితే.. ఇలా ఇచ్చే గుర్తుల్లో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని గుర్తులపై నిషేధం విధించింది. వాటిలో ఆటో రిక్షా - రోడ్డు రోరల్ - క్యాప్ - ట్రక్ - చపాతి కర్ర - ఎండకు పెట్టుకునే టోపీ - ఐరన్ బాక్స్ వంటివి ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రికం సహా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గుర్తులను ఏ పార్టీకీ ఎన్నికల సంఘం కేటాయించదు. దీనికి కారణం.. గుర్తింపు పొందిన పార్టీలకు ఉన్న శాశ్వత ఎన్నికల గుర్తులను ఇవి పోలి ఉండడమే. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం వీటిని నిషేధించింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వీటిని కేటాయించేది లేదని తేల్చి చెప్పింది. ఆటో రిక్షా లాంటి మాస్ గుర్తు ఇండిపెండెంట్లకు బాగా కలిసొస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆటో రిక్షాతో పాటు రోడ్ రోలర్ లాంటి గుర్తులు ఇక ఈవీఎంలలో మనకు కనపడవు.
ఇందుకు కారణాలు ఇవి..
+ తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు.. కారు. అయితే.. రోడ్ రోరల్, ఆటో రిక్షా.. వంటివి.. కారు గుర్తును పోలి ఉంటున్నాయి. దీంతో నిరక్ష్యరాస్యులు, వృద్ధులు పొరపాటుగా.. కారుకు వేయాల్సిన ఓటును రోడ్ రోరల్, ఆటోరిక్షా వంటివాటిపై గుద్దే స్తున్నారు. దీంతో బీఆర్ ఎస్‌కు భారీ డ్యామేజీ జరుగుతోంది.
+ ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్. అయితే.. చపాతీకర్ర..(రెండు రెక్కలు ఉన్నట్టుగా ఉంటుంది), క్యాప్( ఒక రెక్క ఉన్నట్టుగా ఉంటుంది), ఐరన్ బాక్స్ వంటివాటితో తమకు ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో ఈ గుర్తులను ఎవరికీ కేటాయించరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదీ.. సంగతి!