ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.. ఎన్నికల హడావుడి మొదలవడంతో ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులు హోరా హోరిగా ప్రచారం చేస్తున్నారు.నెల్లూరు
జిల్లా సర్వేపల్లిలో ఈ సారి రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది..ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి హేమా హేమీ నేతలే తలపడుతున్నారు. అయితే సర్వేపల్లి ప్రత్యేకత ఏటంటే అక్కడి ఓటర్లు ఇప్పటి దాకా ఎవరినీ మూడసారి ఎమ్మెల్యేగా గెలిపించలేదు. ఈ సారి ఆ
చరిత్ర తిరగరాయక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది.
టీడీపీ నుంచి పోటీలో ఉన్న మాజీ
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మరియు
వైసీపీ అభ్యర్ధి
మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి ఇద్దరూ కూడా మూడోసారి విజయం సాధించడానికి బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు కూడ దక్కలేదు. అయితే ఈ సారి ఎన్నికల్లో
వైసీపీ స్పీడ్‌కి బ్రేక్ పడే పరిస్థితి ఉందని తెలుస్తుంది..
టీడీపీ కూటమి, వైసీపీల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ప్రత్యేకించి
మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో రాజకీయంగా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది..
ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక ఉప ఎన్నికతో సహా 15 సార్లు ఎన్నికలు జరిగాయి..
కాంగ్రెస్ ఏడు సార్లు, తెలుగుదేశం నాలుగు సార్లు అలాగే
వైసీపీ రెండుసార్లు, సిపిఐ ఒకసారి మరియు ఇండిపెండెంట్ ఒకసారి గెలిచారు. అంతేకాదు ఈ నియోజకవర్గం నుంచి ఏ
ఎమ్మెల్యే కూడా మూడుసార్లు గెలిచిన పరిస్థితి అయితే లేదు..
సర్వేపల్లి ఓటర్లు కాంగ్రెస్ నుంచి సివి శేషారెడ్డి, ఆదాల ప్రభాకర్రెడ్డిలను,
టీడీపీ నుంచి మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మరియు
వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిలను రెండేసి సార్లు ఎమ్మెల్యేలుగా గెలిపించారు .ఆ క్రమంలో ఈ సారి పోటీచేస్తున్న
మంత్రి కాకాణి, మాజీ
మంత్రి సోమిరెడ్డిల్లో ఎవరు గెలిచినా కూడా అది నియోజకవర్గ చరిత్రలో ఓ రికార్డ్
గా మిగలనుంది..
సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఓటమి పాలైన
టీడీపీ నేత సోమిరెడ్డి ఈసారి సానుభూతి ఓట్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కలిసివస్తాయని ఆయన ఆశిస్తున్నారు.
అయితే వ్యవసాయశాఖ మంత్రిగా కాకాణి అధికార బలంతో కక్ష సాధింపులకు దిగుతున్నారని, రైతులకు కానీ వ్యవసాయశాఖకు కానీ ఆయన చేసిందేమి లేదని, అభివృద్ధి కంటే అవినీతే ఎక్కువ జరిగిందని సోమిరెడ్డి ఆరోపిస్తున్నారు.మరోపక్క వైసిపి ప్రభుత్వం వచ్చాకే సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి చెందిందని, ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికి చేరుతున్నాయని.. టీడీపీ ప్రభుత్వంలో దోచుకోవడం తప్ప అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ జరిగిందని కాకాణి ప్రశ్నిస్తున్నారు.. దీనితో ఇక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. సర్వేపల్లిలో మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ చరిత్ర తిరగరాసేదెవరో చూడాలి.