సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పార్టీలు అయినటువంటి టీడీపీ , జనసేన , బీజేపీ లో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాలను నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఉభయ గోదావరి జిల్లాలను పర్యటించనున్నారు. అందులో భాగంగా వీరిద్దరూ ఈ ప్రాంతంలో ఈరోజు పలు రోడ్డు షోలను... ఓ భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో ఇవాళ సాయంత్రం 4 గంటలకు రోడ్ షో ను నిర్వహిస్తారు. ఆ తర్వాత చంద్రబాబు , పవన్ కల్యాణ్ రోడ్డు మార్గాన తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మీదుగా నిడదవోలు చేరుకుంటారు. నిడదవోలు గణేష్చౌక్ సెంటర్లో రాత్రి రోడ్ షో నిర్వహిస్తారు. చంద్రబాబు, పవన్ కలిసి తొలిసారి ఉమ్మడిగా జిల్లాలో పర్యటిస్తున్నారు. దాంతో వీరిద్దరి పర్యటనకు చాలా ప్రాధాన్యత పెరిగింది. ఇకపోతే ఈ పర్యటనలో చంద్రబాబు, పవన్ కలిసి పర్యటించడానికి ప్రధాన కారణం అక్కడి అసంతృప్తి నేతలను సంతృప్తి పరచడం కోసం అని కూడా తెలుస్తుంది.
పొత్తులో భాగంగా తణుకు, అమలాపురంలో టీడీపీ ... నిడదవోలు, పి.గన్నవరంలో జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇలా సీట్ల పంపకం ద్వారా కొంతమంది టికెట్ దక్కని నేతలు ఉన్నారు. ప్రస్తుతం ఆ నేతలంతా టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆ నేతలకు సంబంధించిన కార్యకర్తలు కూడా ప్రస్తుతం పార్టీలపై కాస్త గుర్రుగా ఉన్నారు.
అలాంటి వారితో కలిసి మాట్లాడి బుజ్జగింపు చర్యలు చేపట్టడం కోసం ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు, పవన్ తలపెట్టినట్లు తెలుస్తోంది. మేమిద్దరం మన పార్టీ అధికారంలోకి రావడానికి కలిసి ఉంటున్నాం. మీరంతా కూడా కలిసికట్టుగా పని చేసి మన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలి అని వారికి చెప్పి వారిని ఒప్పించడానికి ఉపయోగ గోదావరి జిల్లాలో చంద్రబాబు, పవన్ పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది.