ఏపీ: బుగ్గన ఈసారి అక్కడ హ్యాట్రిక్ కొట్టి తన ఉనికిని చాటుకుంటాడా?
ఇకపోతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో డోన్ అసెంబ్లీ నియోజక వర్గం అనేది అత్యంత ముఖ్యమైన నియోజ వర్గం. బుగ్గన ఇక్కడ వచ్చేవరకు డోన్ నియోజక వర్గం కేఇ, కోట్ల కుటుంబాలకు కంచుకోటగా ఉండేది. దానివల్లనే ఆ రెండు కుటుంబాల వారు అక్కడ గెలుస్తూ వచ్చారు. ఏళ్ల తరబడి ఇరు కుటుంబాల ఆదిపత్యాన్ని డోన్‌లో చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వచ్చారు. అయితే, 2014లో కధ మారింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అక్కడ జెండా ఎగరవేశారు. నాడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేఇ ప్రతాప్‌పై 11వేలకు పైచిలుకు ఓట్ల మెజారిటీతో బుగ్గన గెలుపొందారు. 2019లో కూడా బుగ్గన ఇదే ఊపును కొనసాగించారు.
అయితే గత ఎన్నికలు ఓ లెక్క, ప్రస్తుత ఎన్నికలు ఓ లెక్క. ఇపుడు అక్కడ బుగ్గనకు అత్యంత కష్టకాలం నడవబోతుంది. టీడీపీ ఇపుడు పక్కా ప్లాన్ తో అక్కడ ముందుకు దూసుకు పోతున్నట్టు కనబడుతోంది. అవును, 2019లో ఎలాగైన గెలవాలనే రెట్టింపు పట్టుదలతో బరిలోకి దిగిన కేఇ కుటుంబం బుగ్గన చేతిలో దారుణంగా ఓడి పోయింది. దాంతో అక్కడ తెలుగుదేశం పార్టీని ఈ సారి గెలిచి ఈ స్థానాన్ని దక్కించుకోవాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ చేస్తున్నట్టు కనబడుతోంది. దీని కోసం అభ్యర్థిని మార్చాలని కూడా నిర్ణయించారు. అందుకే కేఇ కుటుంబానికి కాకుండా కోట్ల కుటుంబానికి ఇపుడు అక్కడ సీటు కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కుమారుడు మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్రెడ్డిని టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు. కాబట్టి ఈసారి అక్కడ పోటీ గట్టిగా ఉండబోతుందని యిట్టె మనకు అర్ధం అయిపోతుంది.