ఆదిలాబాద్ తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రత్యేక సంతరించుకున్న జిల్లా. ఇది మహారాష్ట్ర సరిహద్దులో ఉండడంతో విభిన్న తెగలకు చెందిన ప్రజలు ఉంటారు. ఈ ఆదిలాబాద్ లో మొత్తం 16 లక్షల 44 ఓటర్లు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి పోటీ చేస్తున్నారు. ఈ మూడు పార్టీల నుంచి ముగ్గురు టీచర్లే పోటీ చేశారు. అలాంటి ఈ తరుణంలో ఆదిలాబాద్ జిల్లా ఓటర్లు ఎవరిని గెలిపిస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో కొత్త చరిత్ర రాస్తారా లేదంటే, పాత సాంప్రదాయాన్ని పాటిస్తారా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఈ పార్లమెంట్ స్థానంలో గత మూడు ఎన్నికల్లో ఏ పార్టీకైనా ఒక్కసారి మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గానికి 1952లో మొదటిసారి ఎలక్షన్స్ జరిగాయి. మొదటిసారి మాధవరెడ్డి గెలిచారు. ఆ తర్వాత వరుసగా ఆరుసార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తర్వాత 1991 నుంచి 1999 వరకు టిడిపి కైవసం చేసుకుంది.
ఇక 2009 నుంచి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడుగా మారింది. ఇక అప్పటినుంచి మూడుసార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి తెలుగుదేశం గెలిస్తే మరోసారి బీఆర్ఎస్ విజయం సాధించగా, మూడవసారి బిజెపి తన ఖాతాలో వేసుకుంది. అయితే ప్రస్తుతం టిడిపి పార్టీ తెలంగాణలో కనుమరుగయింది. అయితే ఈసారి కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ మధ్యనే అద్భుతమైన పోటీ ఉండబోతోంది.. అయితే ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక ఖానాపూర్ లో మాత్రమే విజయం సాధించింది. కానీ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి లెక్కలన్నీ మారిపోయాయి. అధికార కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి మొత్తం వలసలు వస్తున్నారు. దీంతో విజయం సాధించేది కాంగ్రెస్సే అని వారు భావిస్తున్నారు.
అంతేకాకుండా జిల్లా చరిత్రలోనే మొదటిసారి మహిళా అభ్యర్థిని కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఇక ఇన్చార్జిగా మంత్రి సీతక్కకు కీలక బాధ్యతలు చెప్పింది. అయితే ఈసారి బిజెపి రూట్ మార్చి పాత సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు కాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన గూడెం నగేష్ కు కేటాయించింది. దీంతో బీజేపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. అంతేకాకుండా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ బీఆర్ఎస్ లో, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబూరావు కాంగ్రెస్ లో చేరడం బీజేపీ పార్టీకి కాస్త నష్టంగానే చెప్పవచ్చు. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆత్రం సుగుణ రాజకీయాలకు కొత్త. కానీ ఈమె ఆదివాసి హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసింది ప్రజల్లో మంచి ఆదరణ పొందింది.
ఈసారి ఆమె పోరాటమే గెలిపిస్తుందని, అంతేకాకుండా కాంగ్రెస్ అధికారంలో ఉండడం, ఆమెకు ఫైర్ బ్రాండ్ మంత్రి సీతక్క ప్రచారం చేసి గిరిజనులను, ఆదివాసులను అకట్టుకోవడం ప్లస్ పాయింట్లుగా చెప్పవచ్చు. ఇక బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న ఆత్రం సక్కు విషయానికి వస్తే ఈయన ఎంతో సీనియర్ నేత . అంతేకాకుండా 4.64 లక్షల ఓట్ల గులాబీ పార్టీ ఖాతాలో పడ్డాయి. ఎలాగైనా ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన ధీమాతో ఉన్నారు. ఇక బిజెపి అభ్యర్థి నగేష్ విషయానికి వస్తే ఈ జిల్లాలో బిజెపికి ఎక్కువ పట్టు ఉంది. వారి సిట్టింగ్ స్థానం కావడంతో ఈసారి విజయకేతనం ఎగరవేస్తానని గోడం నగేష్ ఆశాభావం వ్యక్తం. కానీ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు మాత్రం తనకు టికెట్ కాదని నగేష్ కి ఇవ్వడంతో పూర్తిగా అలకభూనారు. ఆయనకు ఏ మాత్రం కూడా సపోర్ట్ చేయడం లేదట. దీంతో పార్టీ క్యాడర్ అంతా సైలెంట్ అయిపోయింది. ఈ విధంగా అదిలాబాదులో ముగ్గురు టీచర్ల మధ్య రసవత్తర పోరు జరుగుతుంది.. ఈ తరుణంలో ప్రజలు పాత ఓటింగ్ పద్ధతిని పాటిస్తే మాత్రం ఈసారి కాంగ్రెస్ కు గెలుపు అవకాశం వస్తుందని చెప్పవచ్చు.