ఎలక్షన్లు దగ్గర పడ్డాయి. ఇన్ని రోజుల పాటు రాజకీయ నేతలు, కార్యకర్తలు తమ పార్టీలను, తమ నేతలను గెలిపించడం కోసం తీవ్రంగా కష్టపడ్డారు. భారీ ఎండల్లో కూడా జనాలను ఆకర్షించడానికి గల్లి గల్లి తిరిగి తమ పార్టీలను, తమ అభ్యర్థులను ప్రచారం చేశారు. ఇక వారి ప్రచార గడువు ముగిసినట్లే. దానితో వారు ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం వచ్చేసింది. ఇక ఓటు హక్కును వినియోగించుకొని సరైన వ్యక్తిని ఎన్నుకునే అవకాశం ఇప్పుడు ప్రజల చేతుల్లోకి వచ్చేసింది.
ఇప్పుడు టైం అంతా ఓటర్లదే. వారు ఎవరు అయితే తమ ప్రాంతానికి మంచి చేస్తాడో, అలాగే రాష్ట్రంలో ఏ నాయకుడు అయితే ప్రజలను ప్రగతి వైపు నడిపిస్తాడో, అలాగే దేశంలో ఏ నేత ఉంటే ప్రజలు ఆనందంగా, ఆర్థికంగా ప్రగతిని సాధిస్తారో ఓటు హక్కుతో తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఇంత అమూల్యమైన ఓటు వేయడంలో కొంతమంది నిర్లక్ష్యం వహిస్తారు. మన ఒక ఓటుతో ఏది మారదు. లీడర్లు వస్తుంటారు... వెళ్తుంటారు.
వారి స్వప్రయోజనాల కోసమే వారి జీవితకాలం పయనిస్తారు. అలాంటి వారి కోసం ఎన్నో పనులను పక్కనపెట్టి , ఎంతో డబ్బును ఖర్చు చేసి ఓటు హక్కు వినియోగించుకోవడం అవసరమా..? అనే ఉద్దేశంతో చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోవడంలో బద్దకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకండి. మీ ఒక్క ఓటు ఎంతో అమూల్యమైనది.
దాని ద్వారా మీరు ఒక గొప్ప పౌరుడిగా ఉండగలుగుతారు. మీరు వేసే ఓటు మీ కోసం మాత్రమే కాదు. మీ చుట్టూ ఉన్న ప్రజల కోసం... దేశ పౌరుల కోసం. మీరు ఎవరికి అయితే ఓటు వేస్తారో ఆయన గొప్ప మంచి పనులు చేయకపోవచ్చు. కానీ ఓడిపోయిన వ్యక్తి నేనెందుకు ఓడిపోయాను..? నన్ను ఎందుకు ప్రజలు తిరస్కరించారు అనే ప్రశ్న మొదలవుతుంది. దానిలో నుండి వచ్చే ఎన్నికల్లో అతనే గెలిచిన కొన్ని మంచి పనులు చేసే అవకాశం ఉంటుంది.
ఒకవేళ మీ ఓటు మీరు ఎవరికి వేయొద్దు అనుకున్నా కానీ నోటాకు వేసిన అక్కడి ప్రజల్లో నేతలపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా తెలుస్తోంది. దానిద్వారా కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఏదో ఒక రకంగా ఓటు హక్కును వినియోగించుకోవడం వల్ల మీరు మీ దేశానికి మంచి చేసిన వారు అవుతారు. అంత గొప్ప ఓటు హక్కును అస్సలు మిస్ చేసుకోవద్దు. మీ ఓటు హక్కు ప్రగతికి తొలి మెట్టు.