ఖమ్మం కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..?
- కాంగ్రెస్ ప్రచారానికి దూరంగా పలువురు ముఖ్యులు?
- తటస్థ ఓటర్లు ప్రత్యర్థి వైపు చూసే అవకాశం ఉందంటున్న విశ్లేషకులు
( ఖమ్మం - ఇండియా హెరాల్డ్ )
ఉద్యమాల గుమ్మం ఖమ్మంలో కాంగ్రెస్ నేతల ఆదిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చినట్లు కనిపిస్తుంది. ఇటీవల జరిగిన సమావేశంలో ముఖ్య నేతలంతా పాల్గొనగా.. రాజ్యసభ ఎంపీ, ఫైర్ బ్రాండ్ రేణుక చౌదరి మాట్లాడుతూ మండలాధ్యక్షులకు పదవులు కావాలి కానీ.. పనులకు రారంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కాగా.. కాంగ్రెస్‌లోని ఓ వర్గం నేతలు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సమావేశంలోనే నిరసన తెలిపారు. ఇదిలా ఉంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడైన ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ప్రచారం విషయంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు పలువురు అంతగా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. అడపాదడపా ప్రచారంలో పాల్గొంటున్నారు తప్ప పూర్తిస్థాయిలో సమయం కేటాయించడం లేదని, దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పూర్తిస్థాయిలో ప్రచార బాధ్యతలను చూసుకుంటున్నారన్న చర్చ జరుగుతొంది.
* ప్రచారంలో ముందున్న ప్రత్యర్థులు
తొలినుంచి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిత్వం విషయంలో ఉత్కంఠ నెలకొనగా.. దాదాపు నామినేషన్ల చివరి రోజున ఒక కొలిక్కి వచ్చి ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురామ రెడ్డిని ఖరారు చేసి, అదేరోజున చివరి గంటలో నామినేషన్ దాఖలు చేశారు. కానీ అప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు రెండు సార్లు ఖమ్మం ఎంపీ స్థానంలోని ఏడు అసెంబ్లీ స్థానాలను చుట్టేసి వచ్చారు. ఇక బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు కూడా తన ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. పలు కారణాలతో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామ రెడ్డి మాత్రం వెనుకబడి పోయారన్న చర్చ జరుగుతోంది.
* వ్యూహాత్మకంగానే కథానాయకుడు వెంకటేశ్ ప్రచారం..
ముగ్గురు మంత్రుల్లో ఐక్యత లేదన్న ప్రచారం, ఎంపీ అభ్యర్థి స్థానికుడు కాడనీ, దొర కుటుంబం నుండి వచ్చాడని, రాజకీయంగా, సామాజికంగా చైతన్య వంతమైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దొర పెత్తనం సహిచరనీ, అందుకే కాంగ్రెస్‌కు ప్రజలు వ్యతిరేక తీర్పునిస్తారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తగ్గించి ఓటర్లను తమ వైపునకు ఆకర్షించుకునేలా కాంగ్రెస్ ప్రచారానికి సినీ గ్లామర్ ని అద్దిందన్న చర్చ జరుగుతోంది. రఘురాం రెడ్డికి వియ్యంకుడు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన అగ్ర కథానాయకుడు దగ్గుపాటి వెంకటేశ్‌ను ప్రచారంలోకి దింపారని, తద్వారా ప్రజలను ఆకర్షించడంతోపాటు.. తమ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉన్న కమ్మ సామాజిక వర్గం వారిని కూడా తమ వైపునకు తిప్పుకునేలా వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ సందడి కాసేపే ఉందని మరుసటి రోజు నుంచి నేతలంతా ఎవరికి వారుగా ఉండిపోయారనీ సమాచారం. ఇక రఘురాం రెడ్డికి కోడలు అయిన వెంకటేష్ కుమార్తె కూడా రంగంలోకి దిగి తన మామను గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తోంది.
* ప్రత్యర్థులకు కలిసి వస్తున్న పరిణామాలు
కాంగ్రెస్ లోనే పరిణామాలను గమనిస్తున్న తటస్థ ఓటర్లు ఆ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, బిజెపి అభ్యర్థి తాండ్ర వినోద్ రావు వైపు చూస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. సిట్టింగ్ ఎంపీ అయినటువంటి నామా నాగేశ్వరరావు జిల్లాకు చెందిన వ్యక్తిగా ఆయనకున్న పరిచయాలు కలిసొస్తాయని పేర్కొంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తీర్పట్ల అసంతృప్తిగా ఉన్న టిడిపిలోని అధిక శాతం క్యాడర్ తమ పాత కాపు అయినా నామా నాగేశ్వరరావుకు మద్దతుగా నిలవాలని భావిస్తుంది. జిల్లాకు కొత్త వ్యక్తి అయినటువంటి బిజెపి అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ప్రచారంలో దూసుకుపోతున్నప్పటికీ సంస్థ గతంగా పార్టీకి బలం లేకపోవడం మైనస్ గా మారింది. ఇది కూడా నామా నాగేశ్వరరావుకే కలిసి వస్తుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.