ఓటు హక్కును వినియోగించుకున్న బాబు, జగన్.. బాబుకు కూడా అదే కష్టమొచ్చిందా!
చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తున్నా ఆయన ఓటు హక్కు మాత్రం ఉండవల్లిలో ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. పవన్ కళ్యాణ్ లా చంద్రబాబు కూడా తన ఓటును తాను వినియోగించుకోలేని పరిస్థితి నెలకొందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు వైఎస్ జగన్ తన భార్య భారతితో కలిసి కడప జిల్లా పులివెందులలోని భాకరాపురంలో తన ఓటు హక్కును వినియోగించుకుని వార్తల్లో నిలిచారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారని సమాచారం అందుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్త్ ను ఏర్పాటు చేశారు. పలు పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉండటం గమనార్హం. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయిస్తుండగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాలలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. చెదురుముదురు ఘటనలు మినహా రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతుండటం గమనార్హం. కొన్ని ప్రాంతాలలో మాత్రం టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటూ ఉండటం గమనార్హం. కొన్ని గ్రామాలలో పోలింగ్ అనుకున్న సమయానికి మొదలుకాకపోవడం ఓటర్లకు చిరాకు తెప్పిస్తోంది. భారీ వర్షం వల్ల కూడా కొన్ని ప్రాంతాలలో పోలింగ్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో పోలింగ్ 2 గంటలు ఆలస్యంగా మొదలైంది.