ఏపీలో వైసీపీ గెలుస్తుందని కొన్ని సర్వేలు, కూటమి విజయం సాధిస్తుందని మరికొన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఈ తరుణంలో మీడియా సంస్థలు, సర్వే సంస్థలు, సెఫాలజిస్టులను సైతం తలదన్నేలా కొందరు జ్యోతిష్యులు ఫలితాలను చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. దీంతో ఆ తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఏపీలో పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరిగాయి.
మే 13న ఎన్నికలు జరగగా దాదాపు 3 వారాల తర్వాత ఫలితాలు రానున్నాయి. అయితే జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. వీటి కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అధికారం ఎవరు చేపడతారు, ప్రతిపక్షంలో ఎవరు కూర్చుంటారు అనే దానిపై ఇప్పటికే ప్రీ పోల్స్‌లో కొన్ని సంస్థలు ఒకసారి తమ సర్వే ఫలితాలను చెప్పాయి. అయితే ఓటరు నాడి ఖచ్చితంగా తెలియాలంటే మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూడాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల ముందు వరకు ఒక ఎత్తు, ఎన్నికల సమయంలో మరొక ఎత్తు అనే విధంగా ఓటరు నాడి ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే సర్వేలతో సంబంధం లేకుండా ప్రముఖ జ్యోతిష్యులు ఏపీలో ఎవరు అధికారం చేపడతారో ముందుగానే తేల్చేశారు.
ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా కొనసాగాయి. ఎన్నికల ఫలితాలపై వైసీపీ, కూటమి పార్టీలు ధీమాగా ఉన్నా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తెలుసుకునేందుకు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై జూన్ 1 సాయంత్రం వరకు ఆంక్షలు ఉన్నాయి. అయితే గ్రహాలు, నక్షత్రాలు, జాతకాల ఆధారంగా కొందరు జ్యోతిష్యులు రాష్ట్రంలో ఎవరు అధికారం చేపడతారో ముందే తేల్చారు. అలాంటి వారిలో ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యులు కప్పగంతు శ్రీరామకృష్ణ శర్మ ఉన్నారు. పంచాంగం విషయంలో ఈయనకు మంచి పేరుంది.
ఈయన అంచనా ప్రకారం 106 స్థానాల్లో వైసీపీ విజయం సాధించనుంది. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఉపదృష్ట నాగాదిత్య కూడా పలువురు సినీ తారలకు, సెలబ్రెటీలకు జ్యోతిష్యం చెప్పి ఫేమస్ అయ్యారు. ఆయన ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 135 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కార్పొరేట్ జ్యోతిష్యుడు వేణు స్వామి కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు. వైసీపీ మరోసారి విజయం ఖాయమని, అయితే అతికష్టం మీద వైసీపీ గట్టెక్కుతుందని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మించి, సెఫాలజిస్టులు కూడా అవాక్కయ్యేలా వీరు చెప్పిన ఫలితాలు ఉన్నాయి. దీంతో వీరి చెప్పింది నిజం అవుతుందో లేక అంచనా తప్పుతుందో జూన్ 4 వరకు చూడాలి.